తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ను బోర్డు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది కంటితుడుపు చర్యేననీ.. విద్యార్ధుల జీవితాలతో ఆడుకున్న గ్లోబరీనా సంస్ధపైనా చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.  


తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ బదిలీ అయ్యారు.  వేరే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంటర్ అడ్మీషన్స్ నుంచి ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి 22 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం అశోక్ కుమారేనని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల మృతిపై అశోక్ చేసిన కామెంట్స్ కూడా పెద్ద దుమారమే  రేగింది. 


ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఎంత వత్తిడి తెచ్చినా ప్రభుత్వం మాత్రం అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోలేదు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా అశోక్ కుమార్ వచ్చాక బోర్డు పరిస్థితి రోజురోజుకు దిగజారిందన్న విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు అశోక్ కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త సెక్రటరీగా సయ్యద్ ఉమర్ జలీల్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.   


ఇంటర్ పరీక్షల నిర్వహణలో.. ఏ మాత్రం అవగాహన, అనుభవం లేని గ్లోబరీనా అనే సంస్థకు టెండర్లు కట్టబెట్టి.. అమాయక విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని విపక్షాలు, విద్యార్ధి సంఘాలు మండిపడ్డాయి. అశోక్ కుమార్‌పై బదిలీ వేటు వేసి... చేతులు దులుపుకుంటే సరిపోదని,  ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషాదం జరిగి నెలలు గడిచిన తర్వాత...ఇప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని వారు విమర్శిస్తున్నారు. రాష్ట్రపతి నివేదిక అడిగి నెల రోజులు గడిచిన తర్వాత... కొత్త గవర్నర్‌కు దీనిపై వివరణ ఇవ్వాలన్న భయంతోనే  సర్కారు ఈ చర్య తీసుకుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను బదిలీ చేస్తూ... టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటితుడుపు చర్యగానే భావించాల్సి ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్శన్ విజయశాంతి చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: