గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసే ప్రయత్నాలు సాగుతున్నాయి.  రోజులు గడుస్తున్నా మృతదేహాల వెలికితీత కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే వారం గడిచిపోయింది. సంప్రదాయ పద్ధతిలో బోటును బయటకు తీసుకొచ్చేందుకు కాకినాడ సత్యం బృందం ప్రయత్నిస్తున్నా.. అందుకు అవసరమైన సామాగ్రిని సమకూర్చేందుకు అధికారులు ఇంకా చర్చల్లోనే ఉండటం అనుమానాలకు తావిస్తోంది. 


గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. నదీ గర్భంలో ఉన్న బోటును బయటకు తీయడం దాదాపు అసాధ్యంగా మారింది.  భారీ క్రేన్లు, పడవలు.. ప్రమాద స్థలానికి చేరే అవకాశం లేకపోవడంతో ఆ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. అందులో చిక్కుకుపోయిన మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయి.. శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా విడిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు బంధువులు. అయితే చివరి మృతదేహాన్ని గుర్తించే వరకూ వశిష్ట ఆపరేషన్‌ కొనసాగుతుందని చెబుతోంది ప్రభుత్వం. 


బోటును బయటకు తీసుకొచ్చేందుకు వచ్చిన కాకినాడ బృందానికి అవసరమైన సామాగ్రిని అందించడం లేదని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ సత్యం బృందంతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.  వెయ్యి మీటర్ల భారీ ఐరన్‌ రోప్‌, ప్రొక్లయినర్‌ సమకూర్చాలని కోరింది సత్యం బృందం. కనీసం 800 మీటర్ల ఐరన్‌ రోప్‌ సమకూర్చితే రెండువైపులా లంగర్లు బిగించి.. మునిగిన బోటు చుట్టూ ఐరన్‌ రోప్‌ తో వలయం ఏర్పాటు చేస్తే.. ఏదో ఒక మూల అది బోటును ఒడిసి పడుతుందని సత్యం బృందం భావిస్తోంది. దాంతో బోటును బయటకు లాగే  ప్రయత్నం సులవవుతుందని చెబుతోంది. 


ఇదే తరహాలో గతంలో అనేక బోట్లను వెలికి తీసిన అనుభవం సత్యం బృందానికి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే రెండు రోజుల్లో బోటును బయటకు తీయవచ్చని  అంటున్నారు. ఇదిలా ఉంటే గోదావరిలో బోటు ప్రమాదం జరిగిన సరిగ్గా వారం రోజుల అనంతరం మరో మృతదేహన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. సుమారు ఆరేళ్ల వయసుండే బాలిక మృతదేహన్ని కచ్చలూరు వద్ద గుర్తించారు. జీన్స్, టీషర్టు, ఫాస్ట్ ట్రాక్ వాచ్ ధరించినట్టు గుర్తులున్నాయి. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: