భారత ప్రధాని మోదీ ఈ నెల 27వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. హ్యూస్టన్, న్యూయార్క్ నగరాల్లో మోదీ పర్యటన ఉంటుంది. హ్యూస్టన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులతో సమవేశం ఉంటుంది. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నేతలతో కలిసి ప్రసంగిస్తారు. అయితే, హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 


తమ ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తున్నదని, దీన్ని ఇకపై అనుమతించబోమని ట్రంప్ పేర్కొనడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే భారత్‌కు కల్పిస్తున్న ప్రాధాన్య హోదాను (జీఎస్పీ) కూడా ట్రంప్ సర్కారు ఉపసంహరించుకుంది. దీంతో జూన్ 5న భారత్.. అమెరికాకు చెందిన 25 ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. ఇలాంటి ఉద్రిక్త వాతావ‌ర‌ణంలో...అమెరికాలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న నిర్వహించబోయే హౌడీ మోదీ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు ట్రంప్ కూడా హాజరుకానున్నారు. సుమారు 50,000 మంది ప్రవాస భారతీయుల సమావేశం వేదికను ఆయన పంచుకోవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అని గురువారం విలేకరులు ప్రశ్నించగా.. ఉండొచ్చు. ప్రధాని మోదీతో నాకు మంచి అనుబంధం ఉన్నది అని ట్రంప్ సమాధానమిచ్చారు. మోదీ సభకు ముందే వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ఇరు దేశాలు ప్ర యత్నిస్తున్నట్లు అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. 


ఇదిలాఉండ‌గా, ప్ర‌ధాని మోదీ ఈనెల 24న ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటేరస్ ఇచ్చే విందుకు హాజరవుతారు. మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి బృందంతో కలిసి 150 మొక్కలు నాటనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో మోదీ చర్చలు జరపనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రసంగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: