కశ్మీర్ విష‌యంలో గుంజుకుంటున్న పాకిస్థాన్‌కు ఊహించని షాక్ ఖాయ‌మంటున్నారు. వచ్చేవారం ప్రారంభమయ్యే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందని ఆయన అధికార ప్రతినిధి స్టెఫానె డుజరిక్‌ వెల్లడించారు. డుజరిక్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... వివాద పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గమని, కాబట్టి ఇరుదేశాలు చర్చలు జరుపాల్సిన అవసరం ఉందని గెటెరెస్‌ పేర్కొన్నారన్నారు. ‘కశ్మీర్‌ అంశంలో తాను ఎప్పుడూ పాలుపంచుకుంటానని ప్రధాన కార్యదర్శి గతంలోనే చెప్పారు. ఈ అంశాన్ని లేవనెత్తేందుకు సర్వసభ్య సమావేశాన్ని ఆయన వినియోగించుకునే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.


గుటెరస్‌ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్‌, పాక్‌ చర్చలు జరుపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇరుదేశాలు అంగీకరిస్తే సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాగా, జమ్ము కశ్మీర్‌ తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఐరాస, అమెరికాతో సహా మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించబోమని భారత్‌ స్పష్టం చేస్తోంది.


ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ...ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి పాకిస్థాన్‌ దిగజారి ప్రవరిస్తే, భారత్‌ అందుకు దీటుగా బదులిస్తుందని స్పష్టం చేశారు. గతంలో ఉగ్రవాదానికి మద్దుతుగా నిలిచిన పాక్‌.. ఇప్పుడు విద్వేషపూరిత ప్రచారానికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే విషప్రచారం ఎక్కువ కాలం నిలువదని స్పష్టం చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పదేపదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో సయ్యద్‌ అక్బరుద్దీన్‌ పై విధంగా స్పందించారు. న్యూయార్క్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐరాస సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ లేవనెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారా? భారత్‌ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘కొంతమంది దిగజారే అవకాశం ఉంది. అయితే మేం పైకెగసి వారికి సమాధానం ఇస్తాం. వచ్చే వారం జరిగే ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు భారత్‌ ఏ విధంగా పైకెగుస్తుందో తెలియజేస్తాయి’ అని సమాధానమిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: