గడచిన కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురవటంతో కుందూ నది పరివాహక ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయారు. ఇళ్లు కూలిపోవటం, రోడ్లు దెబ్బ తినటమే కాకుండా రైతులు కూడా భారీగా నష్టపోయారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తో పాటు అధికారులకు కూడా సీఎం కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
రైతులను, ప్రజలను ఆదుకునే విషయంలో నిబంధనలను చూడొద్దని చెప్పారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఉదారంగా సహాయం చేయాలని, పరిహారం అందించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. నంద్యాల డివిజన్ లోని చాలా ప్రాంతాలలో వరదల వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు భారీగా నష్టం కూడా వాటిల్లింది. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించటం జరిగింది. 
 
సీఎం అధికారులతో వరదల వలన రెండు మున్సిపాలిటీలలో, ఏడు మండలాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని 2 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 33 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇవ్వాలని సూచించారు. 
 
దెబ్బ తిన్న ఇళ్లకు, పశువులకు, రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో 15 శాతం పెంచి ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఇంటికి 2 వేల రూపాయలు అదనంగా ఇవ్వాలని సీఎం సూచించారు. కుందూ నదికి వరద వచ్చినా పరివాహక గ్రామాలకు నష్టం రాకుండా ప్రణాళిక రూపొందిస్తామని జగన్ చెప్పారు. రిజర్వాయర్లకు వెళ్లే ప్రధాన నీటి కాలువల సామర్థ్యాన్ని పెంచాలని సీఎం సూచించారు. 40 - 45 రోజుల్లోనే సీమలోని రిజర్వాయర్లు నిండేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: