ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ తో పాటు మరో ఐదు కట్టడాలను కూల్చివేయాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు .  ఈమేరకు సీఆర్డీఏ అధికారులు, ఆయా  ఇంటి యజమానులకు తుది  నోటీసులు జారీ చేశారు.  కృష్ణానది కుడిగట్టు కరకట్ట పై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఈ ఐదు భవనాలు ఉన్నాయి.  కృష్ణానది కరకట్ట పై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 31 భవనాలను గుర్తించిన  సీఆర్డీఏ అధికారులు గతంలో  ప్రాథమిక నోటీసులు జారీ చేశారు.


 నోటీసులు అందుకున్న వారు  ఇప్పటికే సీఆర్డీఏ అధికారులను కలిసి తమ వాదనలు వినిపించారు . 20  భవనాలకు  సంబంధించిన యజమానులు వాదనలు విన్న సీఆర్డీఏ  అధికారులు అందులో ఐదు కట్టడాలను కూల్చివేయాలని  నిర్ణయించి, తుది  నోటీసులు జారీ చేశారు.  వారం రోజుల వ్యవధిలో వారే తమ కట్టడాలను కూల్చివేసుకోవాలని ,  లేకపోతే సీఆర్డీఏ చర్యలు తీసుకుంటుందని సదరు నోటీసులో పేర్కొన్నారు.  వీటిలో చంద్రబాబు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ ఒకటికాగా,  శివ స్వామి ఆశ్రమంలో ఉన్న రెండు భవనాలు ,  ఆక్వా డెవిల్స్ పేరుతో ఉన్న ఒక కట్టడం మరో మూడు అంతస్తు భవనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు .


దీనితో చంద్రబాబు నాయుడు నివసిస్తున్న లింగమనేని గెస్ట్ హౌస్ సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం ఖాయమని తేలిపోయింది. ఈ నేపధ్యం లో సీఆర్డీఏ  అధికారులు తాను నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్  కూల్చివేత ప్రక్రియను చేపట్టక ముందే చంద్రబాబు ఆ ఇంటిని ఖాళీ చేసి , తన మకాం మరొకచోటకు మారుస్తారా ?, లేకపోతే సీఆర్డీఏ అధికారులు కూల్చివేత ప్రక్రియలు చేపట్టే వరకు  అక్కడే ఉంటారా? అన్నది  ఆసక్తికరంగా మారింది. సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేసే సమయం లో చంద్రబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: