ఏపీ రాజధానిపై సర్కార్‌ మళ్లీ ఫోకస్ పెట్టిందా..? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లావాదేవీలను వెలికితీస్తూనే... రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను మార్చనుందా..? రాజధాని సహా రాష్ట్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఆ కమిటీ ఉద్దేశ్యమేంటి.? 


రాజధానిపై గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్‌. అమరావతి సహా రాష్ట్రాభివృద్ధి ప్రణాళిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందీ కమిటీ. 


కమిటీని వారం క్రితమే ఏర్పాటు చేసినా.. ఇప్పటికీ పనిని మొదలు పెట్టలేదు. అయితే.. త్వరలోనే కమిటీ తన పనిని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కమిటీ సభ్యులు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. దీంతో రాజధానిని ప్రస్తుతమున్న చోటే ఉంచుతారా..? లేక మారుస్తారా..? అనే కన్ఫ్యూజన్‌ ఉన్న క్రమంలో కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోందన్న ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రాజధాని సహా.. రాష్ట్ర భౌగోళిక స్వరూపం.. వనరుల లభ్యత.. వాతావరణ పరిస్థితులు.. వంటి అంశాలపై కమిటీ ప్రభుత్వాన్ని సమాచారం కోరినట్లు తెలుస్తోంది. 


శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా అధ్యయనం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల కాలంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక గురించి పదే పదే ప్రస్తావిస్తోంది. గత ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదని.. కానీ ఆ విధంగా చేయలేదంటూ ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను స్టడీ చేయమని ప్రభుత్వ పెద్దలు జీఎన్‌ రావు కమిటీకి సూచించినట్టు సమాచారం. ఏపీ రాజధానిపై త్వరలోనే స్పష్టత రానుంది. కేపిటల్ గురించి పలు రకాల విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం కమిటీతో క్లారిటీ ఇవ్వాలని భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: