తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలు రెండుగా చీలిపోయాయి. ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన కార్మికులు ఎవరికి వారు గ్రూపులుగా ఏర్పడి ఒకరి పై ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న నాలుగు సంఘాలు ఏకమై ఆర్టీసీ జేఏసీగా ఏర్పడితే.... ఈ రోజు మిగిలిన ఐదు సంఘాలు కలిసి ఆర్టీసీ జేఏసీ1 గా ఏర్పడి సమ్మెకు సిద్ధమైయ్యాయి.  


ఆర్టీసీలో మరో జేఏసీ ఏర్పాటైంది. తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దీనిని ఏర్పాటు చేశారు. టీజేఎంయూ, కార్మిక సంఘ్‌, బహుజన కార్మిక యూనియన్‌, బహుజన వర్కర్స్‌ యూనియన్‌, సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్ లు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి.  కాగా... కొత్తగా ఏర్పాటైన తమ జేఏసీ తరపున యాజమాన్యానికి ఉమ్మడి డిమాండ్ ల నోటీసు ఇచ్చినట్టు కన్వీనర్‌  తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నదే తమ జేఏసీ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు.


ఇదిలా ఉంటె తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలు స‌మ్మెకు సై అంటున్నాయి. ఎవ‌రికి వారే స‌మ్మెనోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు... ఏక తాటిపైకి వచ్చేలా లేవు. ఆర్టీసీ కార్మిక సంఘాలు రెండు జేఏసీలుగా ఏర్ప‌డి పోరు బాట ప‌ట్టాయి. ప్ర‌భుత్వం త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌క పోతే ఆందోళ‌న‌ ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. న‌ష్టాల్లో కూరుకు పోతున్న ఆర్టీసీని గ‌ట్టెక్కించ‌కుండా తాత్సారం చేస్తోంద‌ని ఆర్టీసీ కార్మికులు విమ‌ర్శిస్తున్నారు. యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం స్పందించ‌క పోతే స‌మ్మెనోటీసుల కాలంలో ఏ క్ష‌ణంలో అయినా స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.  


తెలంగాణ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డంతో పాటు పీఆర్సీని వెంట‌నే ప్ర‌క‌టించ‌డం, కార్మికుల‌కు ఉద్యోగ భద్ర‌త‌ క‌ల్పించాల‌న్న ప్ర‌ధాన డిమాండ్ లతో ఆర్టీసీ జేఏసీ, జేఏసీ1లు స‌మ్మె నోటీసులు ఇచ్చాయి. విడివిడిగా య‌జ‌మాన్యానికి నోటీసులు ఇచ్చినా ఇప్పుడు వారంతా రెండు జేఏసీలుగా వేదిక‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆర్టీసీ న‌ష్టాల‌కు కార‌ణం కార్మికులు, యాజ‌మాన్యం కాద‌ని ప్ర‌భుత్వ విదానాలే కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి కార్మిక సంఘాలు. 


ఎలాంటి లాభాలు లేక‌పోయిన సామాజిక బాద్య‌త‌గా స‌ర్వీసుల‌ను న‌డిపిస్తున్నామ‌నీ.. ప్ర‌భుత్వ‌మే న‌ష్టాల‌ను పూడ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇత‌ర రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఆర్టీసీ సంస్థ‌ల‌కు ఈక్వీటీల రూపంలో ఆదుకుంటున్నాయ‌ని.. ప్ర‌భుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన ప‌న్నుల‌కు రాయితీలు ఇవ్వాల‌ని కోరారు. సంస్థ‌కు స‌బ్సిడీ పాసుల రూపంలో 530 కోట్లు చెల్లించాల‌నీ.. మొత్తం రూ.2200 కోట్లు ప్ర‌భుత్వం నుండి రావాల్సి ఉందన్నారు.  ప్రభుత్వం దిగిరాక పోతే భ‌విష్య‌త్తులో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు ఉధృతం చేస్తామ‌ని హెచ్చరిస్తున్నారు.


కార్మికుల స‌మ్మె నోటీసుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఈ నెల 23న కార్మిక‌శాఖ క‌మిష‌న‌ర్ అధ్య‌క్ష‌త‌న చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది. అయితే ఇవి కేవ‌లం నామ‌ మాత్ర‌మేన‌నీ.. ప్ర‌భుత్వ‌మే క‌ల‌గ‌జేసుకుని స‌మ‌స్య ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని కోరుతున్నాయి కార్మిక సంఘాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: