ఏపీ రాజకీయల్లో ఫ్యామిలీ రాజకీయాలు టీడీపీ టైంలో జోరుగా సాగాయి. తండ్రీ కూతురు, మామ, మేనకొడలు, బాబాయ్ అబ్బాయి, వియ్యంకులు ఇలా అన్ని రకాల బంధాలకు టీడీపీలో చోటిచ్చేసి అధికారమే పరమావధి అనుకున్నారు. అయితే తరువాత కాలంలో అదే చేటు తెచ్చింది. ఈ బంధాల సంబంధాల వల్ల వచ్చిన రాజకీయ  గబ్బుతో మరింత ఘోరమైన ఓటమి ఎదురైంది. దీంతో ఇపుడు సైలెంట్ ఉన్న ఈ బంధువులు ఒక్కొక్కరుగా కమలం నీడన చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారుట.


విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు, టీడీపీలో చక్రం తిప్పిన నారాయణ ఇపుడు బీజేపీలో చేరుతారని రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నారాయణ నిజానికి రాజకీయవేత్త కాదు, టీడీపీకి ముఖ్యమైన ఆర్ధికవనరుగా ఉంటూ వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన నారాయణ చంద్రబాబు హయాంలో వెలుగు వెలిగారు. మునిసిపల్ మంత్రిగా ఆయన్ని చంద్రబాబు ముందు పెట్టి అమరావతి రాజధాని కధ నడిపారని అంటారు.


ఇవన్నీ ఎలా ఉన్నా నారాయణ పెద్దల సభలో సభ్యునిగా ఉంటున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఈ నేపధ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ఖాళీ కాబోతోంది. దీంతో నారాయణ ఇపుడు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇపుడు నారాయణకు సరైన రాజకీయ వేదిక అవసరం.


ఇక ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఆయన టీడీపీ విషయంలో ఎడం పాటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సైతం బీజేపీ వైపు చూస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ముందు నారాయణ‌ వెళ్లిన తరువాత గంటా కూడా కమలం కండువా కప్పుకుంటారని టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో రాజకీయ తమాషా.


మరింత సమాచారం తెలుసుకోండి: