కేసీయార్ రాజకీయ యోధుడు. అంతకు మించి వ్యూహకర్త. మోడీ, అమిత్ షా మాదిరిగానే అపర చాణక్యుడుగా పేరు గడించిన వారు. లేకపోతే రెండు ఎంపీ సీట్లు చేతిలో పెట్టుకుని 545 మంది ఉన్న పార్లమెంట్ ని గడగడలాడించడం అంటే మాటలా. కేసీయార్ తెలంగాణా తెస్తానన్నారు, సాధించారు. ఆ మీదట రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తెలంగాణా కోసం కేంద్రంలో  సోనియాతో స‌ఖ్యతగా ఉన్న కేసీయార్ మోడీతోనూ చనువుగా ఉంటూ వచ్చారు.


ఇపుడు రెండవ టెర్మ్ లో అధికారంలోకి వచ్చాక మాత్రం కేసీయార్ టోన్ బాగా మారింది. ఎందువల్ల అంటే ఆయనకు మోడీ షాలతో చెడిందన కారణంగా అని చెప్పుకోవాలి. ముందస్తు ఎన్నికలు తెలంగాణాకు జరిపించుకున్నంతవరకూ సాఫీగా సాగిన స్నేహ బంధం తరువాత కాలంలో మాత్రం ముక్కలైంది. కేసీయార్ జాతీయ రాజకీయాల వైపు చూపు చూడడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నిజానికి మోడీకి బీజేపీకి మెజారిటీ  రాబట్టి సరిపోయింది లేకపోతేనా. ఇపుడు అదే మోడీ అమిత్ షా ద్వయంలో కసిగా కనిపిస్తోంది. అందువల్ల కేసీయార్ కి తెలంగాణాలో మూడవసారి చాన్స్ అసలు ఇవ్వరాదని భావిస్తున్నారు.


దాంతో కాంగ్రెస్ కంటే దూకుడుగా బీజేపీ తెలంగాణాలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో మౌనంగా కొన్నాళ్ళు ఉన్న కేసీయార్ ఇపుడే జూలు గట్టిగా విదిలిస్తున్నారు. పోరాడితే పోయేదేముంది అన్న తీరున కేసీయార్ అడుగులు వేస్తున్నారు. నిండు అసెంబ్లీలో మోడీ సర్కార్ మీద గట్టిగా విరుచుకుపడ్డారు.  కేంద్రంలో మోడీ పొలిటికల్  గ్లామర్ నానాటికి తగ్గుతుందని కేసీయార్ అంచనా, ఆర్ధిక మాంద్యం కారణంగా మోడీ పట్ల  ప్రజలలో వ్యతిరేకత నెమ్మదిగా పెరిగి తరువాత కాలంలో పుంజుకుంటుందని ఆయన భావిస్తున్నారు. మరి ఆయన అంచనా నిజమైతే మాత్రం మోడీతో ఢీ కొట్టేందుకు  తెలంగాణా సింహం రెడీ అయినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: