ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పనితీరు పర్వాలేదనిపించేలా ఉంది. గతంతో పోలిస్తే నేతలు కూడా మెరుగైన వాదన వినిపించారనే అభిప్రాయాలు వస్తున్నాయి. సెషన్ కే రానుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రప్పించడంలో సీఎల్పీ సఫలమైందనే చర్చ జరుగుతోంది. 


తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య అరుకు పడిపోయింది. ప్రజాసమస్యలపై కాంగ్రెస్...అసెంబ్లీ లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది..?  అనే చర్చ జరిగింది. కానీ గడిచిన 10 రోజులుగా సభలో కాంగ్రెస్ పనితీరుపై కొంత సానుకూల చర్చ మాత్రం జరుగుతోంది. బీజేపీకి వెళ్లాలా?.. వద్దా..? అనే కన్ఫ్యూజన్ లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సభలో మాత్రం కాంగ్రెస్ సభ్యుడి పాత్రకు న్యాయం చేశారు. సీఎల్పీ లో ఉన్న సభ్యుల్లో సీతక్క, పొడెం వీరయ్య లాంటి వాళ్లకు..సభలో పలు అంశాలను కేటాయించి... అందరికీ మాట్లాడే అవకాశం కల్పించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 


సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా... గడిచిన పది రోజుల్లో పలు అంశాలపై బలంగానే సభలో చర్చించగలిగారు. బడ్జెట్ సందర్భంగా... భట్టి ప్రజెంటేషన్.. సర్కారు నుంచి సమాధానాలు రాబట్టగలిగింది. ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా .. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తినా.. కేసీఆర్ చాతుర్యం ముందు భట్టి వాదన నిలబడలేదు. కానీ కాంగ్రెస్ సభ్యుల్ని సమన్వయం చేస్తూ.. బలమైన వాదన వినిపించడంలో భట్టి సక్సెసయ్యారనే చెప్పాలి. కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించి టిఆర్ఎస్ లో చేరి మంత్రి వర్గంలో చేరిన సబితా ఇంద్రారెడ్డి ... సభలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. మొత్తానికి అసెంబ్లీ లో కాంగ్రెస్ కొంత మెరుగైన పనితీరు ప్రదర్శించ గలిగింది. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా మాత్రం కోల్పోయింది. పీఏసీ పదవి కూడా ఎంఐఎంకు వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: