అదేమిటి.. మంత్రి ప‌ద‌వి కోసం ఆ నేత‌ల ఆఖ‌రి అస్త్రం..! అని అనుకుంటున్నారా..?  నిజ‌మే మీ డౌటు! తెలంగాణ మంత్రి వ‌ర్గం ప‌రిపూర్ణంగా ఉంది. తెలంగాణ‌లో ఉన్న మొత్తం 119స్థానాల‌కు ముఖ్య‌మంత్రితో క‌లిపి 18మంది మంత్రులతో మంత్రివ‌ర్గం ఏర్పాటు చేయొచ్చు. అది ఇటీవ‌ల చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆరుగురికి అవ‌కాశం ఇవ్వ‌డంతో ప‌రిపూర్ణం అయింది. అయితే.. అంతా అయిపోయాక‌.. మంత్రి ప‌ద‌వి కోసం ఆ నేత‌లు సంధించే అఖ‌రి అస్త్రం ఏమిట‌ని..? ఎవ‌రా నేత‌లు..? అని ఆలోచిస్తున్నారా..? అయితే.. ఇక సూటిగా విష‌యానికే వ‌చ్చేద్దాం..! టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల ఆరుగురు కొత్త‌వారితో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌డం.. ప‌లువురు నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.


ఈ మంత్రివ‌ర్గంలో మాదిగ, ఉప‌కులాల‌ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికి అవ‌కాశం క‌ల్పించ‌లేదు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇదే స‌మ‌యంలో మాల సామాజిక‌వ‌ర్గానికి చెందిన కొప్పుల ఈశ్వ‌ర్‌కు మొద‌టి మంత్రివ‌ర్గంలోనే అవ‌కాశం ఇచ్చారు. అయితే.. రెండోసారి చేప‌ట్టే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనైనా మాదిగ‌ల‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆ సామాజిక‌వ‌ర్గ ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో కొంద‌రుపైకి అసంతృప్తి వ్య‌క్తం చేసినా.. మ‌రికొంద‌రు లోలోప‌ల ర‌గిలిపోతున్నారు.


ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్టేషన్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో మాదిగ‌లు సుమారు 11 నుంచి 12శాతం ఉంటార‌ని, అయినా మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌లేద‌ని, మాదిగ‌ల కోసం ఉద్య‌మించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి కూడా మంత్రిప‌ద‌వి ఆశించారు కానీ.. ఆయ‌నకు కూడా నిరాశే ఎదురైంది. ఇక మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందే తీవ్ర అసంతృప్తిని అస‌మ్మ‌తిని వెల్ల‌గ‌క్కారు.


అయితే.. తాజా విష‌యం ఏమిటంటే.. మాదిగ‌, ఉప‌కులాల వారికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేనంటూ ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ‌మాదిగ ఆధ్వ‌ర్యంలో ఆదివారం హ‌న్మ‌కొండ‌లో నిరాహార దీక్ష‌చేప‌ట్టారు. మంత్రిప‌ద‌వి ఇచ్చేవ‌ర‌కూ ఉద్య‌మిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. మంద కృష్ణ వెనుక ఉన్న నేత‌లెవ‌రు అన్న‌దానిపై ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అసంతృప్త నేత‌లే మంద కృష్ణ వెనుక ఉండి న‌డిపిస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. దీనిపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: