మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌కు ముందు.. విస్త‌ర‌ణ త‌ర్వాత కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి సెగ‌లు ర‌గులుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్క‌డో ఒక చోట‌.. ఎవ‌రో ఒక‌రు.. త‌మ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. ఈ అసంతృప్తి సెగ‌లు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నికో ప్ర‌తికూల ఫ‌లితాల‌కు దారితీస్తుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పార్టీలో అసంతృప్త సెగ‌లు ఒక‌వైపు ఉండ‌గానే.. మ‌రోవైపు.. మాదిగ సామాజిక‌వ‌ర్గం దెబ్బ‌త‌ప్ప‌ద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.


ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మాదిగ‌ల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏర్పాటు చేసిన మొద‌టి మంత్రివ‌ర్గంలో మాదిగ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌కు స్థానం క‌ల్పించ‌లేదు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఇటీవ‌ల చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనైనా స్థానం ల‌భిస్తుంద‌ని ప‌లువురు ఎమ్మెల్యేలు అనుకున్నారు.


ఇందులో కూడా స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డంతో.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో మాదిగ‌లు సుమారు 12శాతం ఉంటార‌ని, అయినా మంత్రివ‌ర్గంలో ఒక్క‌రికి కూడా స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డం స‌రికాద‌ని, మాదిగ‌ల కోసం పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్పుకొచ్చారు.


ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. ఏకంగా తెలంగాణ భ‌వ‌న్‌లో విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసిమ‌రీ.. తన‌కు ఎలాంటి అసంతృప్తి లేద‌ని రాజ‌య్య సెల‌విచ్చారు. మంత్రివ‌ర్గంలో మాదిగ‌లు, ఉప‌కులాల వారికి స్థానం క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌ హన్మకొండ కేడీసీ మైదానంలో ఒక రోజు మహాదీక్ష చేశారు. ప‌లు పార్టీల నాయకులు, ఎమ్మార్పీఎస్ శ్రేణులు దీక్షకు మద్దతుగా వచ్చారు.


తెలంగాణ ప్రభుత్వం మాదిగ & ఉపకులాలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిందని .. ఇందుకు నిరసనగా మాదిగ ఉపకులల మహాదీక్షను ఒకరోజు చేస్తున్నారని చెప్పారు. ఈ నేప‌థ్యంలో హ‌జూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మాదిగ‌సామాజిక‌వ‌ర్గం టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డికి మ‌ద్ద‌తు ఇవ్వ‌బోర‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించేందుకే మాదిగ‌లు ప‌నిచేస్తార‌ని ప‌లువురు అంటున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రి వారు ఎవ‌రికి మ‌ద్దతు ఇస్తార‌న్న‌ది ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: