దేశ జనాభాలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున ఈ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యత క్రమంలో తొలిస్థానం కల్పించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ లో స్వర్ణభారతి ట్రస్టులో ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంస్థ సంయుక్త నిర్వహణలో జరిగిన రైతునేస్తం పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా కృషి చేస్తున్నాయని.. అయినా వ్యవసాయాభివృద్ధికోసం మరింతగా చేయాల్సింది ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ఎక్కువశ్రద్ధ కనబరచాల్సిన అవసరం ఉందన్నారు.  పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్, సరైన సమయంలో సరైన మొత్తంలో రుణాలు అందకపోవడం, సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వంటివి అన్నదాతకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అన్నదాత లేకుంటే మన నోట్లోకి నాలుగు ముద్దలు దిగవని.. ఆరుగాలం కష్టించి ఆయన నిద్రలేని రాత్రులు గడిపితేనే మనకు భోజనం దొరుకుతుందన్న విషయాన్ని మరవొద్దన్నారు. రైతు బిడ్డగా తాను రైతు సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తానన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలన్నీ రైతుతో, వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయని.. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఆ సంస్కృతిని తన జీవనంలో భాగం చేసుకున్నట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ప్రకృతిని ప్రేమించమని పెద్దలు సూచించారని వారెప్పుడూ ప్రకృతితోనే మమేకమయ్యేవారన్నారు. కానీ మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నందునే తరచూ ఆ ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నామని పేర్కొన్నారు.



భూమాతతో నేరుగా సంబంధమున్నది రైతు ఒక్కడేనని ఆయన పనిని ఎవరూ చేయలేరన్న ఉపరాష్ట్రపతి.. అన్నదాతను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చైతన్య పరిచే ప్రక్రియలో భాగంగా 14 ఏళ్లుగారైతునేస్తం పత్రికతోపాటు ‘పశునేస్తం’, ‘ప్రకృతినేస్తం’ (సేంద్రియ వ్యవసాయదారుల కోసం) పత్రికలను యడ్లపల్లి వెంకటేశ్వర రావు నడపడం అభినందనీయమన్నారు. రైతులకు మార్గదర్శనం చేస్తూనే వ్యవసాయాభివృద్ధికి వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారిని ప్రోత్సహించేలా అవార్డులు అందించడాన్ని ప్రశంసించారు. రైతు బిడ్డగా.. రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవాడిగా అన్నదాతలకు స్ఫూర్తి కలిగించే ఇలాంటి కార్యక్రమాలకు నాడు కేంద్ర మంత్రిగా.. నేడు ఉపరాష్ట్రపతిగా ఉన్నా వస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతు సాగుపై చేసే ఖర్చు తగ్గించుకునే పద్ధతులపై దృష్టి సారించాలని తద్వారా రైతు సాధికారతకు మార్గం సుగమం అవుతుందని ఆయన సూచించారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని.. 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపయ్యే లక్ష్యంతో పనిచేస్తున్నాయన్నారు. అయితే ఈ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడంతోపాటు ఈ-నామ్, కోల్డ్ స్టోరేజీలు  వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. ఈ దిశగా నీతి ఆయోగ్ ఆలోచన చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.



బ్యాక్ టు విలేజ్, బ్యాక్ టు అగ్రికల్చర్ అని మహాత్ముడు చెప్పినట్లుగానే పరిస్థితులు మారుతున్నాయన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఏం చేయాలనేదానిపై స్వయంగా చొరవతీసుకుని పూణె, చెన్నై, ఢిల్లీలో పలు జాతీయ సదస్సులు నిర్వహించామన్నారు. వివిధ నేలల రకాలను బట్టి వ్యవసాయంలో రావాల్సిన మార్పులపై ఈ సదస్సుల్లో ఫలప్రదమైన చర్చ జరిగిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం అనేది భారతీయ సంప్రదాయ వ్యవసాయ పద్ధతని.. పురుగుల మందుల దుష్ప్రభావం నుంచి వినియోగదారులను కాపాడే ఈ విధానం అత్యుత్తమ వ్యవసాయ విధానంగా తాను భావిస్తానని ఉపరాష్ట్రపతి అన్నారు. సుభాష్ పాలేకర్ సహా కొందరు మళ్లీ ఈ విధానాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారిని ఉపరాష్ట్రపతి అభినందించారు. రైతునేస్తం జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జీవీ రామాంజనేయులుని, కృషిరత్న పురస్కారం అందుకున్న ఐఏఎస్ అధికారి డాక్టర్ టి. బాబూరావు నాయుడుని ప్రత్యేకంగా ప్రశంసించారు.



ప్రభుత్వాలు చేస్తున్న సాయంతోపాటు రైతునేస్తం వంటి వేదికల ద్వారా అన్నదాతను చైతన్యవంతం చేయాల్సిన అవసరం చాలా ఉందని ఆయన అన్నారు. రైతుకు అండగా నిలుస్తున్నవారిని ప్రోత్సహించాలని.. ఇలాంటి ప్రయత్నాల ద్వారా పది మందిలో స్ఫూర్తి కలుగుతుందన్నారు. చదువుకున్న వారు కూడా వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. దీనితోపాటుగా పాడి పరిశ్రమ, పశుసంపదపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని..పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల పెంపకం వంటి వాటిపై దృష్టిపెట్టిన రైతు కుటుంబాల్లో ఆత్మహత్యలే లేవని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయని గుర్తుచేశారు. గ్రామీణ భారతం ఆర్థికంగా సమృద్ధి సాధించిన రోజే యావద్భారతం పురోగతి సాధిస్తున్నట్లు అర్థమని. తద్వారా రైతు జీవితంలో మార్పు రావాలన్నారు. మీడియా కూడా వ్యవసాయంపై దృష్టి పెట్టి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వారానికో స్పెషల్ ఫోకస్ కార్యక్రమాలపై దృష్టిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ చిగురుపాటి కృష్ణప్రసాద్, కార్యదర్శి సుబ్బారెడ్డి, ఇతర ట్రస్టీలు,  రైతునేస్తం చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: