నేరస్తుడు ఎంత తెలివికలగిన వాడైనా సరే.. ఎక్కడో ఒక్క చోట తప్పు చేయక మానడు.. పోలీసుల విచారణలో ఇది ఓ ప్రాథమిక సూత్రం.. కానీ ఆ తప్పును వెదికి పట్టుకోవడమే పోలీసులకు సవాల్.. అది తెలిస్తే చిక్కుముడి సింపుల్ గా విప్పుకుంటూ పోవచ్చు. అందుకే అలాంటి చిక్కుముడులను విప్పేందుకు కేంద్రం కొత్త అస్త్రం ప్రయోగిస్తోంది.


అదే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ . అంటే నేరగాళ్లకు సంబంధించిన సమస్త సమాచారం.. దేశం మొత్తానికి సంబంధించింది అంతా ఒక్క దగ్గరే ఉంటుందన్నమాట. ఒక్క క్లిక్ తో నేరస్తుల ఆటకట్టించొచ్చు. కొన్నేళ్లుగా ఈ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి రానుంది.


వలసలు, బ్యాంకింగ్, వ్యక్తిగత పన్నుచెల్లింపుదారులు, విమాన , రైలు ప్రయాణాలు తదితర అంశాల సమాచారం అంతా ఈ గ్రిడ్ ద్వారా ఇక అందుబాటులోకి వస్తుంది. వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. రియల్ టైమ్ లో సమాచారాన్ని సేకరించే ఈ వ్యవస్థ ద్వారా తీవ్రవాదుల కదలికలను ముందే పసిగట్టొచ్చు. దాడులను నివారించే అవకాశం పోలీసులకు లభిస్తుంది.


ఈ ప్రాజెక్టు వ్యయం 3400 కోట్లు. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఈవ్యవస్థ ద్వారా వలసలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. నేరస్తుల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, టెలికాం, వ్యక్తిగత పన్నుచెల్లింపులు, విమానాలు, రైళ్లలో ప్రయాణించేవారి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరిపోతాయి.


ప్రాజెక్టు తొలిదశలో భాగంగా పది ఏజెన్సీలు, 21 సర్వీసు ప్రొవైడర్లను గ్రిడ్ తో అనుసంధాస్తారు. నేర పరిశోధన ఈ గ్రిడ్ ఏర్పాటు ద్వారా కొత్త పుంతలు తొక్కబోతోంది. నేరస్తులను అత్యంత వేగంగా ఆటకట్టించే అవకాశం లభించబోతోందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: