ప్రపంచ రాజకీయ చరిత్రలో ఈ కార్యక్రమం చరిత్రాత్మక ఘటనగా నిలుస్తుందని తెలిపారు. రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాల నేతలు తమ కలల్ని, ఆలోచనల్ని పంచుకున్నారన్నారు. ప్రపంచ సౌభాగ్యం కోసం మునుపెన్నడూ లేని విధంగా ఇరువురు నేతలు కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ భద్రత, ఐక్యత కోసం భారత్‌ ఏమాత్రం వెనకాడదన్న సందేశాన్ని మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటానికి యావత్‌ ప్రపంచం అండగా నిలుస్తోందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. 
ప్రధాని మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ ఇనుమడిస్తోందనడానికి హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమమే నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మోదీకి లభిస్తున్న ఆదరణ.. భారత ప్రజలకు దక్కుతున్న గౌరవంగా ఆయన అభివర్ణించారు.


హ్యూస్టన్‌లో మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగం ముగిసిన తర్వాత అమిత్‌ షా తన అభిప్రాయాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. 'అమెరికా గడ్డపై బలమైన భారత్‌ను ఆవిష్కరించినందు'కు మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అత్యద్భుతంగా జరిగిన హౌడీ-మోదీ కార్యక్రమం ప్రపంచ యవనికపై భారత్‌కు చెరగని ముద్రను వేసిందన్నారు. 'హౌడీ-మోదీ' కార్యక్రమం పేరిట భారత్‌-అమెరికా మధ్య పటిష్ఠమైన మైత్రికి హ్యూస్టన్‌ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన 50వేల మంది ఇండియన్‌ అమెరికన్లను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌ చేసిన ప్రసంగాలు జన నీరాజనాలు అందుకున్నాయి.




పాక్‌ది విద్వేష ఎజెండా అని.. ఉగ్రవాదుల అడ్డాగా మారి భారత్‌ విమర్శలు చేస్తోందని ఈ సందర్భంగా మోదీ దాయాది దేశాన్ని దుయ్యబట్టారు. అలాగే భారత్‌-అమెరికా ప్రజల మధ్య మైత్రి పరిఢవిల్లుతోందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల స్వప్నాలను సాకారం చేసేందుకుగాను మోదీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్‌ అన్నారు. అలాగే ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి అమాయక పౌరులకు రక్షణ కల్పిస్తామన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఉభయ దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయన్నారు. భారత సంతతి అమెరికన్లు అమెరికా అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: