ఇదేనా ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉద్యోగులను బెదిరించటం సరికాదు  టిఎస్ యుటిఎఫ్ తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని ఆందోళనలు చేస్తుంటే, సమస్యలు పరిష్కరించకపోగా....కుక్క... తోక...అంటూ అగౌరపరిచేలా మాట్లాడటం, ఉద్యోగులను తొలగిస్తానంటూ బెదిరించటం సమంజసం కాదని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రాములు, సిహెచ్ రవి అన్నారు. ఎంప్లాయి ఫ్రెండ్లీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి కి ఇది ఎంత మాత్రం తగదని వారన్నారు.
2018 మే 16న ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో నాలుగున్నర గంటల పాటు 18 సమస్యలపై చర్చలు జరిపి 13 సమస్యలు పరిష్కరిస్తున్నామని అంగీకరించారు.



అనంతరం విలేఖరుల సమావేశంలో గంటన్నర పాటు తానే స్వయంగా వివరాలు వెల్లడించారు. కానీ ఏడాదిన్నర గడిచినా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపటం లేదు. పైగా ఉద్యోగుల పట్ల శతృపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. 2018 జూన్ 2 నుండి ఐఆర్ ఇస్తామన్నారు, జులై 1 నుండి పిఆర్సీ అమలు చేయాల్సి ఉంది, డిసెంబర్ నుండి రిటైర్మెంట్ వయస్సు పెంపుదల కోసం ఎదురు చూస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమాన వేతనాల చెల్లింపు, సిపిఎస్ రద్దు, ఉపాధ్యాయుల పదోన్నతులు వంటి
సమస్యల పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.





ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేయటం, పరిష్కారం కాకుంటే వివిధ రూపాల్లో ఆందోళన, పోరాటాలు నిర్వహించటం అవసరమైతే సమ్మెకు పోవటం ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కు. రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలం ఉద్యోగులు సకల జనుల  సమ్మె చేసిన విషయం మరచిపోరాదని, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుత ముఖ్యమంత్రే ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ నియంతృత్వంగా వ్యవహరించటం విజ్ఞత కాదని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు సిహెచ్ రాములు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి ఒక ప్రకటనలో తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: