హైదరాబాద్ నగరవాసులకు మెట్రో భయం పట్టుకుంది. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మెట్రో స్టేషన్లలో నిర్మాణ లోపాలు ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. గ్రేటర్ వాసుల కలల మెట్రో స్టేషన్ ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెట్రోస్టేషన్ మెట్ల మార్గం పిల్లర్ కింద నిరీక్షిస్తున్న మౌనిక కాంక్రీటు అంచులు పెచ్చులూడి తలపై పడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది. వాన నుండి రక్షణ కోసం కాసేపు తలదాచుకోవటం ఆ మహిళ పాలిట శాపమైంది. 
 
కాంక్రీటు పెచ్చు చిన్నదే అయినప్పటికీ బాగా ఎత్తు మీద నుండి పడటంతో మౌనిక మృతి చెందింది. అమీర్ పేట మెట్రో స్టేషన్లో జరిగిన ఈ ఘటన స్థానికులను హతాశులను చేసింది. గంటలో తిరిగి వస్తానని చెప్పిన భార్య తిరిగిరానిలోకాలకు వెళ్లిపోవటంతో మౌనిక భర్త హరికాంత్ షాక్ కు గురయ్యాడు. పెళ్లైన సంవత్సరానికే నన్ను వీడి వెళ్లావా అంటూ బాధతో రోదించాడు. మృతదేహం వద్ద బోరున విలపించిన హరికాంత్ ను చూసి పలువురు కంటతడి పెట్టారు. 
 
మౌనిక పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లిలో పుట్టి పెరిగింది. ఏడాది క్రితం కంతల హరికాంత్ రెడ్డితో మౌనికకు వివాహమైంది. హరికాంత్ కు టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితం మౌనిక, హరికాంత్ నగరానికి వచ్చారు. కూకట్ పల్లిలో వీరు నివాసం ఉంటున్నారు. చిన్నాన్న కూతురు నిఖితను అమీర్ పేటలోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక నిఖితతో కలిసి కూకట్ పల్లిలో మెట్రో ట్రైన్ ఎక్కింది. 
 
వర్షం పడుతూ ఉండటంతో ఏ - 1053 పిల్లర్ కింద మౌనిక, నిఖిత నిల్చున్నారు. మూడవ అంతస్తులోని గోడకు చెందిన పెచ్చులు తలపై పడటంతో మౌనిక అక్కడికక్కడే కుప్పకూలింది. ఆటోలో ఆస్పత్రికి తరలించగా మౌనిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లర్లు వాటిపై ఏర్పాటు చేసిన వయాడక్ట్ సెగ్మెంట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కాంక్రీట్ మిశ్రమంతో మూసివేయటంతో పొరపాట్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: