మెట్రో రైలు వచ్చిందని సంబరపడ్డ భాగ్యనగర వాసులకు అదే మెట్రో ఇప్పుడు భయకంపితులను చేస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలను తప్పించుకోవడానికి తమకు మంచి సౌకర్యవంతమైన ప్రయాణంగా ఇప్పటివరకూ భావిస్తున్నారు. కానీ అదే మెట్రో ఇప్పుడు మృత్యువుకు కూడా దారి చూపిస్తుందా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు హైటెక్ వాసులు. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడిపడి మౌనిక అనే యువతి మృతి చెందడం భాగ్యనగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో మెట్రో నిర్మాణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



అమీర్‌పేట్‌ మెట్రో పిల్లర్ వద్ద జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. మెట్రో నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఈమేరకు డిమాండ్ చేశారు. నివేదిక తెప్పించుకుని ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో పిల్లర్లకు పెచ్చులూడడం.. ఓ మహిళ మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మెట్రో పిల్లర్ల నాణ్యతపై తమకు పలు అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పూర్తి వివరాలతో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మెట్రోకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణంలోని నాణ్యత లోపాలపై,చెన్నై ఐఐటీ చేత విచారణ చేయించిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. అందులో ఏడు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా తేల్చారని మెట్రోపై కూడా అలానే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.



మరో కాంగ్రెస్ నేత నిరంజన్ మాట్లాడుతూ..  ఎల్‌అండ్‌టీ అధికారులపై హత్య కేసు నమోదు చేసి బాధిత మహిళ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓవైపు మౌనిక కుటుంబసభ్యులు కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: