వైఎస్ జగన్ రాజకీయం సెపరేట్ ట్రాక్ లో ఉంటుంది. ఆయనది ముక్కుసూటి రాజకీయం అంటారు. చంద్రబాబు ఓ విషయం చెప్పాలంటే దానికి ఎన్ని విధాలుగానో ఆలోచన చేస్తారు. పర్యవసానాలు ఒకటికి పదిసార్లు బేరీజు వేసుకుంటారు. అన్ని వైపుల‌ నుంది ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. మొత్తానికి ఫలితం అనుకూలంగా వచ్చేలా జాగ్రత్తపడతారు. అందుకే బాబు డెసిషన్లు జీవిత కాలం లేట్ అంటారు. అదే జగన్ విషయంలో అలా కాదు.


నోటో మాట ఉండగానే పని పోవాలంటారు.  నాలుగు నెలల ఆయన పాలన తీరు చూస్తే అది అర్ధమవుతుంది. ఇక జగన్ మరో విషయం ఏంటి అంటే అవతల వారిని నమ్ముతారు. బాగా కాకపోయినా ఒకసారి మనసుకు నచ్చాలి కానీ నమ్మేస్తారు. అయితే రాజకీయాల్లో నమ్మకానికి రోజులు చెల్లిపోయాయి. అంతా ఎవరి స్వార్ధం వారు చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగన్ రాజకీయ గండరగండడు కేసీయార్ తో దోస్తీ చేస్తున్నారు. కేసీయార్ అంటేనే మహా ముదురు అని పేరు. ఆయన ఈతపండు ఇచ్చి తాటిపండు లాగే రకం అంటారు. అటువంటి కేసీయార్ తో రాజకీయంగా చెప్పాలంటే జూనియర్ అయిన జగన్ దోస్తీ కట్టడం అంటే ఒకింత అశ్చర్యమే మరి. అయితే జగన్ నమ్మే అతి కొద్ది మందిలో కేసీయార్ కూడా  ఒకరు.


అయితే కేసీయార్ మాత్రం ఎవరినీ నమ్మరని అంటారు. ఆయన బాధ ఎంతసేపు తెలంగాణా రాష్ట్రం, తన పార్టీ, ప్రయోజనాలు మాత్రమే చూసుకుని ఏ పనికైనా సై అంటారు. ఆయన సోనియాగాంధీతో చెలిమి చేసినా, మోడీతో చేయి కలిపినా కూడా చివరికి వారు షాక్ తిన్నారు. కేసీయార్ మాత్రం భారీ రాజకీయ  ప్రయోజనం పొందారు. అటువంటి కేసీయార్ తో ఇపుడు జగన్ దోస్తీ కడితే ఎవరికి లాభం అన్నది చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు అంటారు. కేసీయార్ ముందు జగన్ తన రాజకీయాన్ని చూపగలరా అన్న డౌట్లు కూడా చాలా మందిలో ఉన్నాయి.


మరి రాయలసీమకు గోదావరి జలాలను తీసుకువస్తానని చెబుతున్న జగన్ కేసీయార్ తో కలసి గోదావరి బ్యాక్ వాటర్స్ ని ఎత్తిపోతల పధకాల ద్వారా మళ్ళించేందుకు భారీ ప్రాజెక్టులకు రంగం సిధ్ధం చేస్తున్నారు. ఇందులో గరిష్ట లాభం ప్రయోజనం తెలంగాణాకే ఉంటుందని అంతా అంటున్నారు. ఈ పధకం వరకూ ఒకే కానీ ఖర్చులు ఏపీ ఖాతాలో రాసేస్తే మాత్రం జగన్ ఒప్పుకోకుండా నిలబడాలి. మరి దానికి జగన్ చాణక్య రాజకీయం బయటకు తీస్తారా. కేసీయార్ తో ఢీ కొట్టి మరీ ఏపీ ప్రయోజనాలకు కాపాడుతారా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: