ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్వీ యూనివర్సిటీలో పది రోజుల క్రితం ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వికలాంగుడైన ఒక వ్యక్తిని ఇంఛార్జీ రిజిస్ట్రార్ కార్యాలయంలో దారుణంగా అవమానించారు. ఎన్నో నెలల నుండి పెండింగ్ లో ఉన్న బిల్లుల కొరకు సంబంధిత పత్రాలతో ఇంఛార్జీ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన వికలాంగునితో అక్కడి సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. 
 
ఇంఛార్జీ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి వచ్చిన పిలుపుతో అక్కడికి వెళ్లిన వికలాంగుడైన వ్యక్తికి సమావేశంలో ఇంఛార్జీ రిజిస్ట్రార్ తో పాటు కొంతమంది సిబ్బంది మాటలతో మరియు ప్రవర్తనతో మనోవేదనకు గురయ్యేలా చేశారు. పెండింగ్ బిల్లుల కోసం వచ్చిన వ్యక్తిపై గట్టిగా అరవటం, కుర్చీల నుండి సిబ్బంది లేచి చూపుడు వేలు చూపిస్తూ బెదిరించటం జరిగింది. వికలాంగుడైన ఆ వ్యక్తి ఇలా ప్రవర్తించటం సరికాదని ఎంత చెప్పినా సిబ్బంది ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. 
 
ఆ వ్యక్తి బయటకు రావాలని ప్రయత్నించినా సిబ్బంది వ్యక్తిని బయటకు రానీయకుండా చేశారు. బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మీకేవైనా సమస్యలుంటే న్యాయ పరంగా పరిష్కరించుకుందాం ఇలా చేయటం సరికాదని ఎంత చెప్పినా సిబ్బంది తీరు మార్చుకోకుండా సంతకాలు పెట్టిన తరువాత వికలాంగుడైన వ్యక్తిని వదిలేశారు. 
 
ఈ ఘటన జరిగి ఇప్పటికే పది రోజులైంది. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉంటూ వికలాంగుడైన వ్యక్తితో సిబ్బంది వ్యవహరించిన తీరు సరైనది కాదు. కొందరు చేసిన తప్పు వలన యూనివర్సిటీకే చెడ్డ పేరు వచ్చేలా ఉంది. వికలాంగుడైన వ్యక్తిని అవమానించిన సిబ్బంది ఏవైనా సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేసి ఉండాలే తప్ప ఈ విధంగా కాదు. తప్పు చేసిన సిబ్బంది తీరు మార్చుకుని ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తే మంచిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: