గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, 20లక్షల మంది నిరుద్యోగులను రోడ్డుపాలు చేశారని, పరీక్ష రాసిన వారి జీవితాలతో చెలగాటమాడుతూ, తన పార్టీ కార్యకర్తలకు లబ్ది చేకూర్చుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆక్షేపించారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలిస్తామనే పేరుతో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహణ  చేపట్టి, అందులో పంచాయతీరాజ్‌ శాఖ ప్రమేయాన్ని తీసుకొచ్చి, ఒక రిటైర్డ్‌ ఉద్యోగిని భాగస్వామి ని చేసిన ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుకుందని కళా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిపై పరీక్ష రాసిన 20లక్షల మంది అభ్యర్థులే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవేళ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, సంబంధిత మంత్రులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పరీక్షల్లో జరిగిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చినా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం  ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 


గ్రామసచివాలయ ఉద్యోగ పరీక్ష నిర్వహణలోని ప్రభుత్వ వైఫల్యాలను, చేతగానితనాన్ని గురించి ప్రశ్నించినవారిపై ఎదురుదాడి చేయడానికి 5గురు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు పోటీపడటం సిగ్గుచేటని మాజీమంత్రి మండిపడ్డారు. తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న నిరుద్యోగుల వివరాలు తీసుకొని  వారికి ఫోన్లు చేసి, బెదిరించడం, పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు లేవని చెప్పమని వారిపై ఒత్తిడి చేయడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నట్లు కళా తెలిపారు. జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేపర్‌లీకేజీ ఘటన జరిగిందంటూ ఏ విధమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాలంటూ గగ్గోలు పెట్టడం జరిగిందన్నా రు. గతంలో ఏపీపీఎస్సీగానీ, ప్రభుత్వంగానీ పోటీపరీక్షలు నిర్వహించినప్పుడు అభ్యర్థుల అర్హత,  సామాజికవర్గాల వారీగా నిష్పత్తులు, నియమ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడం జరిగిందని కళా చెప్పారు. 


ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్షలో 36 పేజీల ప్రశ్నపత్రంలో, 150 బిట్లు, రెండున్నర గంటల సమయంలో   పూర్తి చేసి, 112 మార్కులు సాధించడమనేది అంతతేలికగా సాధ్యమవ్వదని, ప్రశ్నపత్రం ముందుగా తెలిస్తేతప్ప, అలాజరగదని పరీక్షరాసిన అభ్యర్థులే చెబుతున్న విషయాన్ని గమనించాలని వెంకట్రావు సూచించారు. అభ్యర్థుల సందేహాలను నివృతి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, వారిపై ఎదురుదాడి చేయడం, పరీక్ష నిర్వహణలోని లోపాలను, ఏపీపీఎస్సీ సంస్థ లోని ఉద్యోగుల బండారాన్ని బయటపెట్టిన వ్యక్తులు, మీడియాపై బెదిరింపులకు పాల్పడటం  ప్రభుత్వానికి తగదని కళా హితవుపలికారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు, పరీక్ష నిర్వహణలోని లోపాలను సరిచేసి, ఫలితాలను నిలిపేసి, ఈ తతంగంపై విచారణ కమిటీవేసి, నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని, జరిగిన అవకతవకలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని టీడీపీ నేత డిమాండ్‌ చేశారు. 


ప్రజాస్వామ్యం లో బెదిరింపులు, దాడులు, దాష్టీకాలు సరికావనే సంగతిని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వందరోజుల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారన్న కళా, నాణ్యమైన బియ్యం పేరుతో గడ్డలుకట్టిన ముక్కిపోయిన బియ్యాన్ని ప్రజలకు అందించడం జరిగిందన్నారు.  అటువంటి అంశాలను, ప్రభుత్వ, అధికారుల వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించేవారిపై కక్ష కార్పణ్యాలతో దాడులు చేయడం, తప్పుడు కేసులుపెట్టి వేధించడం చేస్తున్నారని, కోడెల శివప్రసాదరావు గారి ఉదంతమే అందుకు నిదర్శనమని కళా వ్యాఖ్యానించారు. పాదయాత్రలో చెప్పిన అంశాలను ప్రస్తావిస్తూ, పాలనాలోపాలను గురించి చెప్తున్నారనే అక్కసుతోనే మీడియాపై నిషేధం విధించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక గొంతును నొక్కేస్తే, వేయిగొంతులు, వాటిని నొక్కితే, మరో లక్షగొంతులు, కోటిగొంతులు ప్రతిఘటిస్తాయనే నిజాన్ని, చరిత్రలో జరిగిన సంఘటనలను జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని కళా వెంకట్రావు సూచించారు. ఏబీఎన్‌, టీవీ5 ఛానళ్లు నిలిపేసిన ప్రభుత్వం, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్న మరో ప్రతికపై కూడా కక్ష కట్టిందని ఆయన చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: