అంతర్జాతీయ వేదికలపై  శాంతి వచనాలు చెబుతున్న పాకిస్థాన్...బాలాకోట్‌ను మరోసారి ఉగ్రవాదుల డెన్‌గా మార్చేసింది.  భారత వైమానిక దాడుల తర్వాత మళ్లీ ఇప్పుడు బాలాకోట్ ఉగ్రవాదుల కేంద్రంగా మారిపోయింది. మనదేశంలోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ఐదు వందల మందికి పైగా మిలిటెంట్లు సరిహద్దుల్లో మాటు వేసినట్టు ఆర్మీ చెబుతోంది.


సరిగ్గా ఏడు నెలల క్రితం... పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ పరిధిలోని బాలాకోట్‌ పై వైమానిక దాడులు జరిగాయి.  భారత వాయు సేన బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16ను కూడా వాయుసేన కూల్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న వైమానిక దాడులు జరిగితే అప్పటి నుంచి బాలాకోట్‌లో పెద్దగా ఉగ్రవాద కదలికలు లేవు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం బాలాకోట్ మళ్లీ మిలిటెంట్స్ డెన్‌గా మారిపోయింది. భారత్‌తో యుద్ధానికి కూడా సై అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్న పాకిస్థాన్... గుట్టుచప్పుడు కాకుండా ఉగ్రమూకలను కూడా ఎగదోస్తోంది. 


బాలాకోట్‌ లో ఉగ్రవాదుల శిబరాలు యాక్టివ్ గా మారడం వెనుక పాక్ హస్తముందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెబుతున్నారు.  టెర్రరిస్టులు క్రియాశీలంగా మారడానికి పాక్ ప్రభుత్వమే కారణమన్నారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వ నీతి మరోసారి బయటపడింది. మసూద్ అజార్‌ ను అరెస్ట్ చేయకుండా నాటకాలు ఆడిన పాక్ పాలకులు.. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దుపై రాద్దాంతం చేసి.. భారత్‌ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పాక్ ప్రభుత్వం... ఉగ్రవాదుల విషయంలో మాత్రం తన వైఖరి మార్చుకోలేదు. బాలాకోట్‌కు 500మంది ఉగ్రవాదులను తరలించి భారత్ ను టార్గెట్ చేసుకున్నారు. అయితే చొరబాట్లతో పాటు ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది సైన్యం. నిప్పుతో చెలగాటమాడవద్దని హెచ్చరిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: