హుజూర్ నగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఉపఎన్నికలలో గెలుపుతో రాష్ట్రంలో తమకు తిరుగులేదని తేల్చి చెప్పాలనుకుంటోంది గులాబీ పార్టీ. లక్ష్యం చేరుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, జనరల్ సెక్రటరీలు హుజూర్ నగర్ ఉపఎన్నికలలో పనిచేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


హుజూర్ నగర్ ఉపఎన్నికకు షెడ్యులు విడుదలైన రోజే అభ్యర్థిని ప్రకటించింది టీఆర్ఎస్. గులాబీ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు . షెడ్యూల్ విడుదల కంటే ముందే హుజూర్ నగర్ పై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఫలితాలను విశ్లేషించుకున్న టీఆర్ఎస్.. హుజూర్ నగర్ ఉపఎన్నికపై కసరత్తు మొదలెట్టింది. నియోజకవర్గంపై పట్టున్న నేతలతో.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  సమాలోచనలు చేశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గంలో చేరికలపై దృష్టి పెట్టారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక వ్యవహారాన్ని కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. 


ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇందుకోసం నల్గొండలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కార్యకర్తల సన్నాహక సభ నిర్వహించారు. ఇదే సభలో అభ్యర్థి సైదిరెడ్డికి పార్టీ బీఫామ్ సైతం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ చావు తప్పి, కన్ను లొట్టబోయినట్టు గెలిచారని, ఈసారి టీఆర్ఎస్ విజయం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సామాజికవర్గ, వ్యాపార, కార్మిక సంఘాల మద్దతు కూడగట్టడానికి టీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసింది. టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతోన్న మొదటి ఉపఎన్నిక కావడంతో ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: