విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి వారిని మంచి వ్యక్తులుగా తయారుచేసి సమాజంలోకి పంపవలసిన విశ్వ విద్యాలయాలు మరియు అందులోని సిబ్బంది మంచి, మానవత్వం, దయ, కరుణ అనేవి మరచి విచక్షణారహితంగా ప్రవర్తిస్తే, అటువంటి వారు ఇంక విద్యార్థులకు మంచిని, విద్యను ఏమి బోధిస్తారు. పదిరోజుల క్రితం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక రకాలైన సాంకేతిక సర్వీసులను అందిస్తున్న ఒక ప్రతినిధిని, విశ్వవిద్యాలయ సిబ్బంది పిలిచి మరీ హింసించిన తీరుపై ఇప్పటికీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పటికీ కూడా ఆ సిబ్బంది స్పందించకపోవడం దారుణం. వాస్తవానికి ఆ వికలాంగుడు అందిస్తున్న సాంకేతిక సర్వీసుల గురించి కనీస అవగాహన కూడా లేని ఎస్వీయూ రిజిస్ట్రార్ మరియు ఇంచార్జి రిజిస్ట్రార్ సహా మరికొందరు ఉపాధ్యాయ సిబ్బంది కలిసి, అతడిని పలురకాల చిత్రహింసలకు గురిచేయడం పెద్ద సంచలనంగా మారింది. అతడు ఎంత బ్రతిమాలుతున్నప్పటికీ కూడా కనీసం జాలి, కనికరం వంటివి కూడా లేకుండా పూర్తిగా మానవత్వాన్ని మరిచి అతడిని దూషించడంతో పాటు దండించినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయమై కొద్దిరోజలుగా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సదరు రిజిస్ట్రార్ గారు కానీ, 

ఇంచార్జి రిజిస్ట్రార్ సహా మిగతా అధ్యాపకులు కానీ ఏ మాత్రం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారు ఆ విధంగా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడానికి కారణం, అధికార పార్టీ వారి అందదండలు అని కూడా కొంత ప్రచారం అవుతోంది. నిజానికి ఈ ఘటన జరిగి పది రోజులు గడిచి, ఆ వార్త విరివిగా ప్రచారం అవుతున్నా, విశ్వవిద్యాలయ సిబ్బందిపై చర్య తీసుకునే విధంగా ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో, ప్రచారం అవుతున్న వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. కాబట్టి ఇకనైనా ఈ విషయమై నిజాలు నిగ్గు తేల్చి, ఆ వికలాంగ సోదరునికి న్యాయం చేయాలని అంటున్నాయి పలు విద్యార్థి సంఘాలు. మరి ఇప్పటికైనా విశ్వవిద్యాలయ సిబ్బంది ఆ ఘటనపై తమ సమాధానాన్ని తెలియచేస్తుందో లేదో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: