పాదయాత్ర.. ఓ నాయకుడిని మహా నాయకుడిని చేస్తుంది..ప్రజలకు చేరువ చేస్తుంది. నాయకుడికి ప్రజా సమస్యల పట్ల అవగాహన పెంచుతుంది.. నాయకుడు తాను ఇవ్వాల్సిన హామీలు ఏంటో గుర్తు చేస్తుంది.. నాయకుడిని ప్రజానాయకుడిగా మలుస్తుంది. అంతటి చరిత్ర ఉంది ఈ పాదయాత్రకు.


గతంలో ఓ ఫ్యాక్షన్ లీడర్ గానో.. నిత్య అసమ్మతి వాదిగానో గ్రూపు రాజకీయాల నాయకుడుగానో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాస్ లీడర్.. ప్రజానాయకుడిగా గుర్తింపు వచ్చింది సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారానే.. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక.. రూపొందించిన సంక్షేమ పథకాలకూ స్ఫూర్తి పాదయాత్రే.


వైఎస్ తర్వాత చంద్రబాబు కూడా 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశారు..2014లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ప్రజలకు చేరువయ్యారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అందుకే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి కూడా పాదయాత్రపై మనసు పడింది.


త్వరలో రేవంత్ రెడ్డి కూడా సుదీర్ఘమైన పాదయాత్ర చేయబోతున్నారట. ఈమేరకు ఆయన తన సమావేశాల్లో సంకేతాలు ఇస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన అరాచకానికి చేరిందని చెబుతున్న ఆయన.. కేసీఆర్ ఆలోచనైనా మార్చాలి.. లేదా కేసీఆర్‌ నే మార్చాలి అంటున్నారు. కేసీఆర్ మనసు మార్చడం మన చేతుల్లో లేదు కాబట్టి.. కేసీఆర్ నే సీఎం సీటు నుంచి మార్చాలని చెబుతున్నారు.


తెలంగాణ పల్లెల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటున్న రేవంత్ రెడ్డి... తాను రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ వస్తానని చెబుతున్నారు. అంటే పాదయాత్ర చేస్తే తప్ప ఈ వాదన నిజం కాదు.. అంటే రేవంత్ రెడ్డి మదిలో కూడా సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలనే కోరిక ఉందన్నమాట. ఎప్పటికైనా తెలంగాణ సీఎం కావాలని తపిస్తున్న రేవంత్ రెడ్డి.. అందుకు పాదయాత్రే సోపానం కావాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: