ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. తరచూ ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ లో పర్యటనలు చేయాల్సి వస్తుంది. కానీ.. ఆయన హెలికాప్టర్ పర్యటనల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా.. ఇప్పటికే జగన్ భద్రతపై హెచ్చరికలు వెళ్లాయా..? అవునంటోందట ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత కు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసిందట. అంతే కాదు. సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు అలసత్వంగా వ్యవహరించినందుకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైందట.


విషయం ఏమింటే.. రెండు రోజులుగా సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం బయలు దేరారు.


గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సంబంధించి వివాదం ఉందని సీఎంవో అధికారులకు సమాచారం అందింది. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కూడా జగన్ హెలికాప్టర్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారట. వాస్తవానికి హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి వివరాలను డిగ్రీలు, మినిట్స్,సెకన్స్ ఫార్మెట్ లో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు కేవలం డిగ్రీల్లో మాత్రమే ఇచ్చారని సీఎంవో అధికారులు చెబుతున్నారు.


కేవలం డిగ్రీలు మాత్రమే ఇచ్చి.. మినిట్స్, సెకన్స్ ఇవ్వకపోతే.. ల్యాండింగ్ లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఇది హెలికాప్టర్ ప్రమాదానికి కూడా దారితీయొచ్చు.. అందుకే ఈ నిర్లక్ష్యాన్ని సీఎంఓ తీవ్రంగా పరిగణస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది. అసలు మొత్తం హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు రెడీ అయ్యింది. ఈ వివాదంపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను సీఎంఓ ఆదేశించిందని సమాచారం. జిల్లా రెవెన్యూ అధికారిని విచారణ అధికారిగా నియమించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: