రివర్స్ టెండర్లు ఇస్తున్న షాక్ తో టిడిపి నేతలకు నోట మాట వస్తున్నట్లు లేదు. ముందేమో రివర్స్ టెండర్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. తర్వాతేమో రివర్స్ టెండర్ల వల్ల టైం వృధా కావటం వల్ల ప్రయోజనమే లేదన్నారు. అదే సమయంలో కేంద్రప్రభత్వాన్ని మ్యానేజ్ చేయించి  రివర్స్ టెండర్లకు అడ్డుకట్ట వేద్దామని అనుకున్నారు. ఇపుడేమో ప్రాజెక్టుల నాణ్యతపై అనుమానాలు లేవనెత్తుతున్నారు.

  

తాజాగా టిడిపి నేతల వైఖరి చూస్తుంటే రివర్స్ టెండర్లు ఇచ్చిన షాక్ తో మాటలు వస్తున్నట్లు లేదు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టుకు పిలిచిన రివర్స్ టెండర్లతో ఏకంగా రూ. 682 కోట్ల ప్రజాధాన ఆదా అవటంతో ఏం మాట్లాడాలో దిక్కు తెలీటం లేదు. అందుకనే తాజాగా ప్రాజెక్టుల నాణ్యతపై ఆరోపణలు మొదలుపెట్టారు. తక్కువ ధరలకే పనులను దక్కించుకుని సంస్ధలు చేసే పనుల నాణ్యత కూడా అలాగే ఉంటుందనే  పిచ్చి మాటలు మొదలుపెట్టారు నేతలు.

 

పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు హయాంలో నవయుగ కంపెనీ 4987 కోట్ల రూపాయలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇవే పనులను తాజాగా మేఘా కంపెనీ రూ. 4359 కోట్లకే చేస్తానని టెండర్ వేసింది. రూ. 682 కోట్లు మిగిలిందంటే గతంలో ఇంతే మొత్తం అవినీతి జరిగిందని లెక్కే కదా ? రెండు రోజుల క్రితం పిలిచిన మరో వర్కులో కూడా రూ 58 కోట్లు మిగిలింది. ఒట్టిపోయిన ఖజానాకు జగన్ నాలుగు డబ్బులు మిగుల్చుదామని చూస్తుంటే టిడిపియేమో మోకాలడ్డుతోంది.

 

రివర్స్ టెండర్లతో తమ అవినీతి బయటపడుతోందనే అక్కసే తప్ప మరోటి కనబడటం లేదు టిడిపి నేతల మాటల్లో. మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, పల్లె రఘునాధరెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప లాంటి వాళ్ళంతా పనుల నాణ్యతపై అరోపణలు మొదలుపెట్టారు. నిజానికి కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును రికార్డు టైంలో నిర్మించిన ఘనత మేఘా ఇన్ ఫ్రా కంపెనీ సొంతం అని టిడిపికి కూడా తెలుసు. అయినా సరే వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నారంతే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: