తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ అపర చాణక్యుడు అని అందరికీ తెలిసిందే. అటువంటి కేసీయార్ తో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో నాడు సోనియాగాంధీ, తరువాత నరేంద్రమోడీ, అమిత్ షా కధలు నిరూపించాయి. వీటన్నిటికీ మించి కేసీయార్ చంద్రబాబునాయుడునే ఎదిరించి ఆయన ఉమ్మడి ఏపీకి మళ్ళీ సీఎం కాకుండా చేసిన చరిత్ర కళ్ళ ముందు ఉంది. కేసీయార్ గండరగండడని అంటారు. ఆయన రాజకీయం ముందు ఎవరైనా బలాదూరే అంటారు.


అటువంటి కేసీయార్ విషయంలో ఏపీ సీఎం గా జగన్ ఏ మేరకు జాగ్రత్తలు తీసుకుని స్నేహం చేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. గోదావరి మిగులు జలాలపైన పూర్తి హక్కు అత్యంత దిగువ రాష్ట్రంగా  ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఉంది. ఈ హక్కుతో వచ్చిన నీళ్ళను మనం సొంతంగా ఏపీ నేల మీదే నుంచే ఎత్తిపోతల పధకాల ద్వారా రాయలసీమకు పంపుకుని సస్యశ్యామలం చేసుకోవచ్చు. అవసరం అయితే పులిచింతల ఎత్తును పెంచుకుని మరీ నీటిని నిల్వ చేసి తగిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో ఏ ఇతర రాష్ట్రాల సీఎం ల సహకారం కానీ వారి సలహాలు కానీ అసలు అవసరం లేదు.


అటువంటిది గోదావరి మిగులు జలాలతో క్రిష్ణా నదిని అనుసంధానం చేసే విషయంలో జగన్ కేసీయార్ తో ఎందుకు ఒప్పందం పెట్టుకుంటున్నారన్నది నీటిపారుదల రంగానికి చెందిన నిపుణుల ప్రశ్న. జగన్ చెబుతున్నట్లుగా పై రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నీటి లభ్యత తక్కువగా ఉండదని, అది గరిష్టంగానే  చేరుతుందని అంటున్నారు. నీటి వనరులు పుష్కలంగా చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కే హక్కుభుక్తంగా దక్కుతాయని కూడా అంటున్నారు. అటువంటి సమయంలో గోదావరి నీటితో ఎన్నో అధ్బుతాలు ఏపీ సొంతంగానే చేసుకోగలదు, సంపూర్ణంగా పదమూడు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించి సంపన్న రాష్ట్రం కాగలదు.



ఇందులో ఎటువంటి ప్రమేయం లేని తెలంగాణాను ముందుకు లాగడం వల్ల వారితో ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల రాబోయే కాలంలో పేచీలు, గొడవలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారన్న దానికి వైసీపీ సర్కార్ నుంచి సమాధానం లేదు. ప్రతిపక్షాలతో మాట్లాడి అనుసంధానంపై అడుగులు వేస్తామని కేసీయార్ చెబుతూంటే ఏపీ సీఎం కూడా ప్రతిపక్షాలతో చర్చించాల్సిన బాధ్యత లేదా అని అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీటి పారుదల రంగాల నిపుణులతో పాటు, విపక్షాలను కూడా పిలిచి మాట్లాది ఏపీకి శాశ్వతంగా ఏది మంచి ఒప్పందం అనిపిస్తే అదే చేసుకోవడానికి వైసీపీ సర్కార్ సిధ్ధం కావడం మంచిది. ప్రభుత్వాలు తాత్కాలికం. ప్రజల ప్రయోజనాలు శాశ్వతం. ఈ విషయమో జగన్ వివేచనతో వ్యవహరించాలని అంతా కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: