వైద్య పరీక్షలు ఈ కాలంలో ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. డయాగ్నోస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ అక్కడ మాత్రం కేవలం 50 రూపాయలతో 15 రకాల వైద్య పరీక్షలు చేయించుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో హెల్త్ కియోస్క్ లు ఏర్పాటు అయ్యాయి. ప్రయాణికుల నుండి ఈ అవకాశానికి విశేష ఆదరణ లభిస్తోంది. 
 
రక్తపోటు, షుగర్, బరువు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి, ప్రోటీన్ స్థాయి, బోన్ మారో మొదలగు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల ద్వారా శరీరం యొక్క ఆరోగ్య స్థితి గురించి పరిపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలోని ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పై ఈ సేవలను అందుబాటులో ఉంచారు. ఈ సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
నిద్రలేమి, అలసట, ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా పరీక్షల ద్వారా తెలిసే అవకాశం ఉంది. వేల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య పరీక్షలు కేవలం 50 రూపాయలతో చేసుకొనే అవకాశం లభించటంతో ప్రయాణికులు పరీక్షలు చేయించుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం కాచిగూడ నుండి లక్ష మంది ప్రయాణికులు, సికింద్రాబాద్ నుండి 1.95 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. 
 
భవిష్యత్తులో మరికొన్ని రైల్వే స్టేషన్లలో ఈ హెల్త్ కియోస్క్ లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులకు ఈ వైద్య పరీక్షలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వైద్య పరీక్షల ద్వారా ప్రయాణికులకు వారి ఆరోగ్య స్థితి మీద ప్రాథమిక అవగాహన కలుగుతుంది. హైదరాబాద్ లోని ప్రజలు కొంతమంది ఈ రైల్వే స్టేషన్లకు ప్రత్యేకంగా వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: