సచివాలయ ఉద్యోగాల్లో గందరగోళం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు చేతిలో సరి కొత్త అస్త్రంగా మారింది. ఈ పరీక్షలను రద్దు చేయాలని, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పరీక్షల లీకేజీ ఆరోపణలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు టాప్ ర్యాంకులు రావడం, మెరిట్ లిస్ట్ ఇప్పటి వరకూ బయటపెట్టకపోవడంతో ప్రజల్లోనూ అనుమానాలు పెరిగాయి. దీంతో ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా లేక మంత్రులతో చేయిస్తారా అని సవాల్ కూడా చేశారు. పరీక్షల్లో అంతా బాగానే ఉందని చెప్పుకునే వైసీపీ నాయకులకు అంతులేని ఎదురు దెబ్బ తగిలింది.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందిలోకి  నెట్టాయి. గ్రామ వాలంటీర్లలో 90 శాతం వైసీపీ కార్యకర్తలే నియమితులయ్యారని ఎంపీ వ్యాఖ్యానించారు. సచివాలయ పరీక్షల్లో కూడా మన వాళ్లు చాలా మంది ఎంపికయ్యారని ఆయన చెప్పడం దుమారం రేపింది. అధికార పార్టీ వారికి పోస్టులు కట్టబెట్టే కుట్ర జరిగిందని చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు చాలా మంది ఆరోపించారు. అవకతవకలకు వ్యతిరేకంగా అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యం 19 లక్షల మందికి తీరని వ్యధను మిగిల్చిందని చంద్రబాబు దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ క్యాడర్ డీలా పడింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లకు పరిమితమై చిత్తుగా ఓడిపోవడంతో కొన్ని రోజుల పాటు చంద్రబాబు కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. ఇసుక కష్టాల కారణంగా బాబుకు ఒక అస్త్రం దొరికింది. పోలవరం టెండర్ రద్దు, అమరావతి వివాదంతో పాటు విమర్శల స్వరం పెరిగింది.

ఇప్పుడు సచివాలయ ఉద్యోగాల గందరగోళంతో ప్రభుత్వంపై విరుచుకు పడటానికి ప్రతిపక్షానికి మరింత అవకాశం లభించింది. చంద్రబాబు లేవనెత్తిన అంశాలు ప్రజలను కూడా ఆలోచింప చేస్తున్నాయి. పరీక్షల ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్ లిస్టులను బయట పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్న ప్రజల నుంచి కూడా వినిపిస్తోంది. పారదర్శకంగా పరీక్ష నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఏమైందనేది ప్రశ్న. ఆ జాబితాను ప్రకటించే వరకూ ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు తొలగిపోయే అవకాశం కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: