ఘోర ఓటమి తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబునాయుడుకు సీనియర్ నేతలు షాకిచ్చారా ? అవుననే అంటోంది ఎల్లోమీడియా. అప్పటి పర్యటనపై తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఓటమి తర్వాత చంద్రబాబు చేసిన జిల్లా పర్యటన కూడా అదే కావటం గమనార్హం. అటువంటి పర్యటనలో సీనియర్ నేతల్లో చాలామంది చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చినట్లు చెప్పింది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నేతలకు, కార్యకర్తలకు ఓదార్పును ఇద్దామని చంద్రబాబు రెండు రోజుల పాటు జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అయితే రివర్సులో నేతలు చంద్రబాబుకు షాకిచ్చారట. ఎలాగయ్యా అంటే చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో ఎక్కడా కనబడలేదట.

 

తాను జిల్లా పర్యటనకు వచ్చినపుడు కూడా సీనియర్ నేతల్లో చాలామంది ఎందుకు కనబడలేదో చంద్రబాబుకు కూడా అర్ధం కాలేదని సమాచారం. మొత్తం 19 నియోజకవర్గాలను రివ్యు చేద్దామని చంద్రబాబు అనుకుంటే జరిగింది మాత్రం భిన్నంగా ఉంది. దాంతో నియోజకవర్గాల రివ్యూను గాలికొదిలేసి కేవలం కార్యకర్తలతో సెల్ఫీలు దిగేసి పర్యటన అయిపోయిందనిపించుకున్నారట. అంటే రెండు రోజలు పర్యటనలో నేతలు తక్కువ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారని స్పష్టంగా చెప్పింది కథనంలో.

 

అందుకే చంద్రబాబు కూడా కార్యకర్తలను హత్తుకుంటూ, సెల్ఫీలు దిగుతూ రెండు రోజులు గడిపేశారట. మొదటిరోజు రంపచోడవరం నియోజకవర్గం సమీక్ష జరిగినా చాలా గంటలు సాగేటప్పటకి అందిరికీ నీరసం వచ్చేసిందట. అందుకనే రెండో రోజు అసలు సమీక్షల జోలికే వెళ్ళలేదని చెప్పింది కథనంలో.

 

చంద్రబాబుకు ఓ విషయం మాత్రం అర్దమైయ్యిందట. పార్టీ, వ్యక్తిగత ఓటములతో సీనియర్ నేతలు డీలా పడిపోయినా కార్యకర్తల్లో మాత్రం ఉరిమే ఉత్సాహం గమనించారట. అయితే కార్యకర్తల్లో ఇంతటి ఉత్సాహం ఉన్నా అభ్యర్ధులు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికీ చంద్రబాబుకు అర్ధం కావటం లేదని సమాచారం.

 

కాకపోతే చాలా మంది నేతలకు వైసిపిలోని ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని కార్యకర్తలు ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించారట. కానీ సమీక్షలు లేకపోవటం వల్ల ఫిర్యాదులు చేయటం సాధ్యం కాలేదని కూడా కథనంలో చెప్పింది. మొత్తానికి  రెండు రోజుల పర్యటనలో చంద్రబాబుకే సీనియర్ నేతలు చికాకు తెప్పించారట.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: