మరోసారి తన టెంపరితనాన్ని బయటపెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. ఇంతకీ ట్రంప్‌ కాశ్మీర్‌ అంశాన్ని మళ్లీ ఎందుకు లేవనెత్తినట్టు..? భారత్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మరుసటి రోజే... మళ్లీ పాత పాట ఎందుకెత్తుకున్నట్టు..?


భారత్‌పాకిస్థాన్‌ కోరుకుంటే... కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వానికి నేను సిద్ధం. ఇదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్య. కాశ్మీర్‌ భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమనీ... ఈ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని భారత్ తెగేసి చెబుతోంది. అయితే ట్రంప్‌ మాత్రం తన పాట ఆపడం లేదు.     


హౌడీమోడీ కార్యక్రమంలో భారత్‌, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు  ప్రధాని మోడీతో కలిసి పనిచేస్తామన్నారు ట్రంప్‌. అయితే మరుసటి రోజే ట్రంప్‌ పాత పల్లవి ఎత్తుకున్నారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జరిగిన భేటీ ట్రంప్‌లో టెంపరితనాన్ని తట్టిలేపింది. ఇంకేముంది... కాశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందనీ, ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని చెప్పుకొచ్చారు ట్రంప్‌. భారత్‌, పాక్‌లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని  వ్యాఖ్యానించారు. 


ఇటీవల వైట్‌హౌస్‌ నుంచి ఇదే తరహా ప్రకటన వెలువడడంతో... భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దిగివచ్చిన అమెరికా క్షమాపణ కూడా చెప్పింది. హౌడీ-మోడీ కార్యక్రమంలో భాగంగా వేదిక పంచుకున్న మోడీ, ట్రంప్‌... త్వరలో మళ్లీ భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి  నిర్వహిస్తున్న శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న భారత్‌ ప్రధాని మోడీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షి చర్చలు నిర్వహించనున్నారు. అయితే... కాశ్మీర్‌ విషయంలో వేలు దూర్చేందుకు ట్రంప్‌ ఉవ్విళ్లూరుతుండడం వల్ల మోడీ జరిగే సమావేశంపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. చూడాలి కశ్మీర్ అంశంపై ట్రంప్ జోక్యం ఎంతవరకు దారితీస్తుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: