మనుషులకు మాత్రమే ఇప్పటివరకు ఉన్న ఆధార్ తరహా నంబర్ ఇకపై ఆవులకు లభించనుంది. ఇనాఫ్ పేరుతో కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టులో ప్రతీ ఆవుకు 12 అంకెల సంఖ్య కేటాయించనుంది. దీంతో ఇకపై ఆవుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్ష్యం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా మూడు జిల్లాలే ఎంపికవగా.. అందులో రెండు జిల్లాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండటం
విశేషం.


ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ ఫర్ అనిమల్స్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్... సింపుల్‌గా చెప్పాలంటే  ఇనాఫ్. ఈ పేరుతో పైలెట్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం మూడు జిల్లాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, తెలంగాణలోని రంగారెడ్డి, ఏపీలోని చిత్తూరు జిల్లా ఉన్నాయి. గత వారం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ మూడు నెలల్లో ముగించాలని టార్గెట్ పెట్టుకుంది కేంద్రం. ఈ ప్రాజెక్ట్ అమల్లో ఇక్కడ ఎదురైన అనుభవాలు, ఇబ్బందులు తదితర అంశాలను పరిశీలించి.. దేశమంతటా అమల్లోకి తీసుకురానుంది కేంద్రం.


ఈ పథకంలో ఆవులకు ఆధార్ తరహా నంబర్ కేటాయిస్తారు. ప్రతి ఆవుకు 12 అంకెలతో బార్ కోడ్ గల పట్టీని పశువు చెవికి ట్యాగింగ్ చేస్తారు. ఆ నెంబరుకు రైతు వివరాలతో పాటు పశువు పూర్తి వివరాలు ట్యాబ్ లో నమోదు చేస్తారు. దీంతో.. రైతుకు అందాల్సిన పూర్తి పథకాలు నేరుగా ఆ రైతుకే అందుతాయి. జిల్లాలోని మండలాల్లోని పశుసంవర్థక శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కేంద్రం. 


చిత్తూరు జిల్లాలో ఇప్పటికే మూడు లక్షల ట్యాగులు సరఫరా చేశారు అధికారులు. మరో నాలుగు లక్షల ట్యాగుల సరఫరాకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. దీని కోసం ఇనాఫ్ పేరిట ఇప్పటికే ఓ యాప్ సిద్ధమైంది. రైతులు ఈ యాప్ లోకి వెళ్లి తమ పశువు తాలూకూ నంబర్ టైప్ చేయగానే మొత్తం వివరాలు కనిపిస్తాయి. భవిష్యత్ లో ఇనాఫ్
ట్యాగింగ్ నంబరు ప్రామాణికంగా పశువులకు నష్టపరిహారం, కరువు ఉపశమన పథకాలను అమలు చేయనున్నారు. 


మొత్తం మీద పశువులకు ఈ ప్రత్యేక నెంబర్ ద్వారా.. కేంద్రం ఎంపిక చేసే కరువు మండలాలలో పశుదాణా, దాణామృతం పంపిణీ పారదర్శకంగా ఉండనుంది. ఇనాఫ్ ట్యాగింగ్ పై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి, పాడి రైతులకు అవగాహన కల్పించేందుకు బిజీగా ఉన్నారు పశుసంవర్ధక శాఖ సిబ్బంది.


మరింత సమాచారం తెలుసుకోండి: