చదువు పూర్తికాగానే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా జాయిన్ అయ్యారు. ఆ వెంటనే ఎమ్మెల్యేగా మారి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయితే గతం మరిచి పోకుండా.. మళ్ళీ టీచర్‌గా మారి అందరినీ ఆశ్చర్యంలో పడేశారు. ఇంతకీ టీచర్‌ నుంచి ఉపముఖ్యమంత్రిగా మారి మళ్లీ టీచర్ అయిన ఆమె ఎవరనుకుంటున్నారా..? 


పాముల పుష్పశ్రీవాణి ఏపీ డిప్యూటీ సీఎం.. విజయనగరం జిల్లా కురుపాం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చదువు పూర్తి కాగానే.. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రభుత్వ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అప్పుడే.. చినమేరంగికి చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కుమారుడు పరిక్షిత్ రాజుతో వివాహం అయ్యింది. పెళ్లైన కొద్ది రోజులకే ఎన్నికలు రావటంతో పుష్ప శ్రీవాణిని పోటీలో నిలబెట్టారు శత్రుచర్ల కుటుంబసభ్యులు. దీంతో.. వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


కొద్ది రోజుల్లోనే.. రాజకీయాలు అలవాటు చేసుకున్న పుష్ప శ్రీవాణి సంచలన కామెంట్స్ చేస్తూ.. అప్పటి అధికార పార్టీని ఇరుకున పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఇక ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం అయిన ఆమె తనదైన శైలిలో నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. అయితే ప్రజా జీవతంలో బీజీగా ఉన్నా..  ప్రకృతి సేద్యం కోసం చేస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్‌లో టీచర్‌గా నటించేందుకు అంగీకరించారు ఉపముఖ్యమంత్రి. నిర్వాహకులు అడిగిన వెంటనే.. గతంలో తాను పనిచేసిన టీచర్‌గా నటించడం ఆనందంగా ఉందంటూ ఓకే చెప్పేశారు పుష్పశ్రీవాణి.


నేటి రోజులలో వ్యవసాయం చేస్తున్న రైతుకు మెళకవలు, అవగాహన కల్పించేందుకు తీస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్ లో  నటిస్తున్నారు డిప్యూటీ సీఎం. సామాజిక చైతన్యం కలిగించే షార్ట్ ఫిల్మ్ కావడంతో తన వంతు సాయం చేస్తున్నానన్నారు ఉపముఖ్యమంత్రి. మరోవైపు ఈ ఫిల్మ్‌లో జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కూడా కలెక్టర్‌గా నటించారు.  
మొత్తం మీద  ఓ షార్ట్ ఫిలిం పుణ్యమా అని డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ బుల్లి తెరపై కనిపిస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: