ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు చారిత్ర‌కంగా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్లు, రాజ‌ధాని నిర్మాణం వంటి కీల‌క విష‌యాల‌ను జ‌గ‌న్ చాలా ప్రతిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎలాంటి ఒత్తిడులు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండా ముందుకు సాగుతున్నారు. అదేస‌మ‌యంలో గోదావ‌రి వ‌ర‌ద విష‌యానికి సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుని, ప్రాజెక్టులు నిర్మించాల‌నే దిశ‌గా ముందుకు పోతున్నారు. తాజాగా ఇదే విష‌యంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో చ‌ర్చించారు.


రివ‌ర్స్ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు 58 కోట్లు, 685 కోట్లు ఆదా అయ్యాయ‌ని ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు పెట్టిన అధిక వ్య‌యం నుంచి ప్ర‌జాధ‌నాన్ని కాపాడుకున్న‌ట్టు అయింద‌నేది ప్ర‌భుత్వ వాద‌న‌. ఈ క్ర‌మంలో మ‌రిన్ని ప్రాజెక్టులు కూడా రివ‌ర్స్ లో కి తీసుకుని రిజ‌ల్ట్ చూపించాల‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వెలిగొండ ట‌న్నెల్ ప‌నుల‌కు కూడా రివ‌ర్స్ టెండ‌ర్లు ఆహ్వానించారు.


ఇక‌, అదేస‌మ‌యంలో రాజ‌ధాని అమ‌రావ‌తిని కూడా ఒకే చోట కేంద్రీ కృతం చేయ‌కుండా .. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి జ‌రిగింద‌నే భావ‌న క‌లిగించేలా అన్ని ప్రాంతాల వారూ సంతృప్తి చెందేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. వాస్త‌వానికి ఈ విష‌యంలో మేధావులు కూడా ఇవేసూచిస్తున్నారు. అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీ కృతం అయితే, రాష్ట్రవిభ‌జ‌న వంటి ప‌రిస్థితులు త‌లెత్తే ప‌రిస్థితి ఉంటుంది. కాబ‌ట్టి ప్ర‌భుత్వ ఫ‌లాలు అంద‌రికీ అందాలి.. ప్ర‌భుత్వంపై అంద‌రికీ న‌మ్మ‌కం కావాలి.. అనే దృక్ఫ‌థంతో ముందుకు సాగాల‌నే నిర్ణ‌యాన్ని ఆహ్వానించాల్సిందే అంటున్నారు.


అయితే, అటు రివ‌ర్స్ కానీ, ఇటు అమ‌రావ‌తి కానీ, మ‌రోప‌క్క‌, పొరుగు రాష్ట్రం తెలంగాణ‌తో కానీ మ‌నం ఏర్పాటు చేసుకునే బందం, సంబంధం విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌క పోతే.. ప్ర‌స్తుత మ‌ర్యాద‌లు, గౌర‌వాల‌కు,మొహ‌మాటాల‌కు త‌లొగ్గితే.. చ‌రిత్ర‌లో నిలిచిపోవ‌డం అటుంచి.,. చ‌రిత్ర‌లో మాయ‌ని మ‌చ్చ‌లా మిగిలిపోతార‌ని హెచ్చ‌రిస్తున్నారు. చేసుకునే ఒప్పందాలు, నిర్ణ‌యాలు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా న్యాయ వివాదాల‌కు నిలిచేలా ఉండాలే త‌ప్పితే.. ఎక్క‌డా ప్ర‌భుత్వం త‌ప్పుచేసింద‌నే భావ‌న తెర‌మీదికి వ‌చ్చేలా ఉండ‌రాద‌ని నిపుణులు సైతం సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: