రెండు రోజుల క్రితం గ్రేటర్ వాసుల కలల మెట్రో స్టేషన్ మౌనిక అనే మహిళ ప్రాణాన్ని బలిగొన్న విషయం తెలిసిందే. కాంక్రీటు అంచులు పెచ్చులూడి తలపై పడటంతో మౌనిక మృతి చెందింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించాలంటే ఇప్పుడు ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితి మొదలైంది. వర్షం పడితే మెట్రో పిల్లర్ కింద నిలబడాలనే ఆలోచన కూడా హైదరాబాద్ నగర వాసుల మది నుండి దూరమైంది. 
 
వంతెనపై ఉన్న పెచ్చులు ఊడి పడితే మన పరిస్థితేంటి ? అని నగరవాసులు భయపడుతున్నారు. మెట్రో స్టేషన్ల నాణ్యత, మెట్రో ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు హైదరాబాద్ నగరవాసుల్ని కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ లో రహదారులపైనే నిర్మించిన మెట్రో స్టేషన్లలో ఎక్కడ చూసినా గోడలకు పగుళ్లే దర్శనం ఇస్తున్నాయి. నిర్వహణ లోపాలు, పనుల్లో నాణ్యత లేకపోవటం ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. 
 
ఉప్పల్ ఏరియాలోని మెట్రో స్టేషన్ లో స్లాబ్ గోడలు బీటలు వారాయి. స్టేషన్ స్తంభానికి దగ్గరగా ఉన్న గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. నాగోల్ ప్రాంతంలోని మెట్రో స్టేషన్ స్తంభంపై పగుళ్లు ఏర్పడ్డాయి. హబ్సిగూడలో స్టేషన్ పైపుల నుండి వర్షపు నీరు రోడ్డు మీదకు కారుతోంది. మెట్టుగూడ ప్రాంతంలో వయాడక్ట్ లు కలిసే చోట పగుళ్లు ఏర్పడ్డాయి. మొజంబాహి మార్కెట్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్లో వయాడక్ట్ కే బీటలు పడ్డాయి. 
 
రసూల్ పురా మెట్రో స్టేషన్లో నిన్న పెచ్చులు ఊడి పడ్డాయని సమాచారం. ఎల్బీనగర్ ప్రాంతంలో మెట్రో స్టేషన్ దగ్గర డివైడర్ల పెచ్చులు ఊడుతున్నాయి. మిగతా మెట్రో స్టేషన్లలో కూడా కొన్ని చోట్ల గోడలు బీటలు వారాయి. మెట్రో అధికారులు ఇప్పటికైనా మెట్రో స్టేషన్లలో పెచ్చులు ఊడకుండా, ఇతర సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: