సీమ ప్రాంత‌మైన తిరుప‌తిలో ఏర్పాటైన‌ప్ప‌టికీ..రాష్ట్రం, దేశం గ‌ర్వించేలా ఎదిగిన విశ్వ‌విద్యాల‌యం శ్రీవేంక‌టేశ్వ‌ర ఉర‌ఫ్ ఎస్వీ. ఇక్క‌డ నుంచి అనేక మంది విద్యావేత్త‌లుగా తీర్చ‌దిద్ద‌బ‌డి బ‌య‌ట‌కు వ‌చ్చి దేశానికి సేవ చేస్తున్నారు. అలాంటి యూనివ‌ర్సిటీ ఇప్పుడు వివాదాల‌కు కేంద్రంగా మారిపోయింది. ఇక్క‌డ ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా ఉన్న వ్య‌క్తి వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఇటీవ‌ల కాలంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌లో భాగంగా .. ఈ యూనివ‌ర్సిటీలోని ప‌నుల‌ను ఓ స్వ‌చ్ఛంద సంస్థ చేప‌ట్టింది.


సాంకేతిక సంబంధ‌మైన ప‌నుల‌ను ఈ సంస్థ చేస్తోంది. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో చేప‌ట్టిన ఈ ప‌నులు ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకున్నాయి. రిజిస్ట్రార్ రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తార‌నే వ్యాఖ్య‌లు ముమ్మ‌రంగా వినిపిస్తున్నాయి. స‌ద‌రు సంస్థ‌కు చెందిన ప‌నుల‌కు బిల్లులు కూడా మంజూరు చేయ‌డం మానేసి.. సంస్థ ప్ర‌తినిధిని వేధించార‌ని ఇంచార్జ్ రిజిస్ట్రార్‌పై విద్యార్థి సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ``మిమ్మల్ని నేను ఏదైనా చేయగల``నని రిజిస్ట్రార్ చాంబర్లోనే పంచాయితీ పెట్టి వికలాంగుడిని కూడా చూడకుండా సదరు కంపెనీ ప్రతినిధిని ఇబ్బంది పెట్టి బలవంతపు సంతకాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదొర్కుంటున్నారు.


కొన్నాళ్లుగా న‌లుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ర‌స‌కందాయంలో ప‌డింద‌ని అంటున్నారు విద్యార్థులు.  ఇంచార్జి రిజిస్ట్రార్ గారు తన గేమ్ మొదలు పెట్టేశారని ఎస్వీయూ వర్గాలే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం అమరావతికి వెళ్లి, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో భేటీ అవ్వాల‌ని, ముఖ్యంగా త‌న శాఖ‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయిన ఇంచార్జి రిజిస్ట్రార్ ఈ విష‌యాన్నే ప్ర‌దానంగా చ‌ర్చ‌కు పెట్టేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు.


 ఆయ‌న ఎజెండాలో యూనివర్సిటీ పరిథిలో ఉన్న సవాలక్ష ఇబ్బందులకంటే, మురిగిపోతున్న వందల ఫైళ్ల కంటే, రోజు మార్చి రోజు విద్యార్థులు, సిబ్బంది చేస్తున్న ధర్నాల కంటే కూడా మిన్నగా సదరు కంపెనీ వారి మీదే దృష్టి పెట్టార‌ట‌. దీంతో ఇప్పుడు ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో విమ‌ర్శ‌లు మ‌రింత పెర‌గ‌డం గ‌మ‌నార్హం.  మ‌రి ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో ? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: