పాకిస్థాన్ కేంద్రంగా వచ్చిన భూకంపం ఉత్తర భారతాన్ని కుదిపేసింది. లాహోర్, రావల్పిండిలో తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదయ్యింది. లాహోర్‌కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. పాక్‌లో సంభవించిన భూకంపం... ఉత్తరభారతంపై తీవ్ర ప్రభావం చూపించింది. కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా , చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 4.35 నిమిషాల సమయంలో
ఢిల్లీలో భూమి కంపించినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 


పాక్-భారత్ సరిహద్దు ప్రాంతమైన జమ్మూకశ్మీర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ శివార్లలోని ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా సేపు ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే.. బంధువులు, స్నేహితులు ఫోన్లు చేసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. దీంతో మొబైల్ ట్రాఫిక్ పెరిగింది. ఫోన్లు కూడా కలవలేదు. భూ ప్రకంపనల కారణంగా ఢిల్లీలో మెట్రో రైల్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఎక్క‌డ ఆస్తిన‌ష్టంగానీ, ప్రాణ‌న‌ష్టంగానీ జ‌ర‌గ‌లేదు. పాక్ లో భూకంప ప్రభావం ప్రాణ ఆస్తి, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 


ఎపుడూ ఊహించని విధంగా భూప్రకంపనలు రావడంతో ఉత్తరాదిన ప్రజలు వణికిపోయారు. బ్రతుకు జీవుడా అంటూ తమ జాగ్రత్తల్లో ఉంటున్నారు. బిల్డింగ్స్ లోకి వెళ్లాలంటే కాస్త జంకుతున్నారు. ఒకవేళ అనుకోని ఘటన ఏదైనా జరిగితే ఏంటని ఆందోళన చెందుతున్నారు. అధికారులు భూ ప్రకంపనలకు సంబంధించిన విషయాలను తమకు ఎప్పటికపుడు తెలియజేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇలా జరిగింది కాబట్టి జాగ్రత్తలు పడ్డాం.. ఏ మధ్యరాత్రిలో జరిగి ఉంటే తమ ప్రాణాల సంగతి ఏంటని వాపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: