పోలవరం ప్రాజెక్ట్‌ పనులను గతముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారు 2013లో ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు కట్టబెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ తెలిపారు. ప్రాజెక్ట్‌ కి సంబంధించిన నియమనిబంధనలన్నీ ఆ సమయంలోనే చాలా స్పష్టంగా సదరు కంపెనీకి తెలియచేయడం జరిగిందన్నారు. పనులు పొందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ తరువాత ఆర్థిక సమస్యల వల్ల పనులు చేయలేకపోయిందన్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల  ప్రకారం 2015లో నవయుగ సంస్థకు పనులు అప్పగించడమైందని డొక్కా తెలిపారు. ఆనాటి  కేంద్ర జలవనరుల మంత్రి ఆదేశాల ప్రకారమే, చాలా స్పష్టంగా విధివిధానాలు, నియమనిబంధనలు ఖరారుచేసి నవయుగ సంస్థను ఎంపిక చేయడం జరిగింద న్నారు. తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆ నిబంధనలకు పాతరేసి, మెగాసంస్థకు పనులప్పగించడానికి సిద్ధపడిందని మాజీమంత్రి చెప్పారు. 


2015లో నాటి కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సంస్థలు రూపొందించిన విధివిధానాలు, నియమ నిబంధనలను కాదని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం తగదని డొక్కా హితవుపలికారు. జగన్‌ ప్రభుత్వం నిబంధనలు మార్చి మేఘా కంపెనీకి పనులు అప్పగిస్తే, ప్రాజెక్ట్‌ నాణ్యత, భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు. 


రివర్స్‌ టెండర్‌లో ఇద్దరు బిడ్డర్లుండాలని  ప్రభుత్వ జీవోలో ఉంటే, దాన్ని కాదని సింగిల్‌ టెండర్‌ను, ఆ టెండర్‌ వేసిన కంపెనీని ఎలా ఎంపిక చేస్తారని డొక్కా నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్‌కి టర్బైన్లు సరఫరా చేసే బాధ్యతను కూడా కృష్ణారెడ్డికి చెందిన ఇదే మేఘా కంపెనీకి అప్పగించారని, ఆ సంస్థ చైనా నుంచి టర్బైన్లు సరఫరా చేస్తామని చెప్పడాన్ని బట్టి చూస్తేనే ఆ కంపెనీ ఎలాంటి నాణ్యతాప్రమాణాలు పాటిస్తుందో అర్థమవుతోందన్నారు. చైనాలో తయారయ్యే టర్బైన్లు ఎలాంటి నాణ్యతాప్రమాణాలు కలిగి ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియదా అని మాణిక్యవర ప్రసాద్‌ ప్రశ్నించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: