గతమెంతొ ఘనం...ప్రస్తుతం అథమం....ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి. 2014 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ...2019 ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికలబడింది. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో కేవలం పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. ఇక ఏలూరు, నర్సాపురం రెండు పార్లమెంట్ స్థానాల్లో ఓటమి పాలైంది. అయితే ఈ రేంజ్ లో ఓటమి పాలవ్వడంతో టీడీపీ నేతలు చెట్టుకొకరు...పుట్టకొకరు అన్నట్లుగా అయిపోయారు.


ఐదేళ్ల క్రితం వైసీపీ క‌నీసం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెల‌వ‌డ‌మే గ‌గ‌న‌మైంది. అలాంటిది ఐదేళ్ల‌లో జిల్లాలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు తప్ప పార్టీలో ఎవరు యాక్టివ్ గా లేరు. అసలు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలైతే కంటికి కనిపించడం లేదు. ఏలూరు ఎంపీగా పోటీ చేసిన మాగంటి బాబు, నరసాపురం నుంచి ఓడిపోయిన కలవపూడి శివరామరాజులు అడ్రెస్ లేరు.


అటు మాజీ ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వంగ‌ల‌పూడి అనిత, బూరుగుపల్లి శేషరావు, మాధవ నాయుడు, రామాంజనేయులు పార్టీలో యాక్టివ్ గా లేరు. ఇక వివాదాస్పద నేత చింతమనేని ప్రభాకర్ కేసుల్లో చిక్కుకుని విలవిలాడుతున్నారు. అయితే జిల్లా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి కూడా నేతలనీ యాక్టివ్ చేసే కార్యక్రమాలు ఏమి చేయడం లేదు. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమాల్లోనూ వీరు పెద్దగా కనపడట్లేదు. అటు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్న.. ఈ నేతలు మాత్రం బయటకు రావడం లేదు.


టీడీపీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన వీరి నుంచి స్పందన రాలేదు. అటు ఎమ్మెల్యేలు, ఒక‌రిద్ద‌రు నేత‌లు కొంత మేర పోరాడుతున్న...వారికి జిల్లా నేతల నుంచి పెద్ద సహకారమే అందడం లేదు. అలాగే మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి..బలోపేతం చేయాలనే ఆలోచన చేయడం లేదు. ఇక జిల్లాలో పరిస్తితి ఇలాగే కొనసాగితే...రానున్న రోజుల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: