చిత్తూరు జిల్లా తిరుప‌తిలో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర విశ్వవిద్యాల‌యానికి సంబంధించిన వివాదం ముదిరి పాకాన‌ప‌డుతోంది. ఈ వ‌ర్సిటీలో ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఒక‌రు చేస్తున్న నిర్వాకంతో వ‌ర్సిటీ మొత్తం వివాదాస్ప‌దంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థి సంఘాలు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ విశ్వ‌విద్యాల‌యంలో జ‌రుగుతున్న విష‌యాల‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌లో భాగంగా .. ఈ యూనివ‌ర్సిటీలోని ప‌నుల‌ను ఓ స్వ‌చ్ఛంద సంస్థ చేప‌ట్టింది. సాంకేతిక సంబంధ‌మైన ప‌నుల‌ను ఈ సంస్థ చేస్తోంది. గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో చేప‌ట్టిన ఈ ప‌నులు ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకున్నాయి.


రిజిస్ట్రార్ రాజ‌కీయ నాయ‌కుడిగా అవ‌తారం ఎత్తార‌నే వ్యాఖ్య‌లు ముమ్మ‌రంగా వినిపిస్తున్నాయి. స‌ద‌రు సంస్థ‌కు చెందిన ప‌నుల‌కు బిల్లులు కూడా మంజూరు చేయ‌డం మానేసి.. సంస్థ ప్ర‌తినిధిని వేధించార‌ని ఇంచార్జ్ రిజిస్ట్రార్‌పై విద్యార్థి సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ``మిమ్మల్ని నేను ఏదైనా చేయగల``నని రిజిస్ట్రార్ చాంబర్లోనే పంచాయితీ పెట్టి వికలాంగుడిని కూడా చూడకుండా సదరు కంపెనీ ప్రతినిధిని ఇబ్బంది పెట్టి బలవంతపు సంతకాలు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.


కొన్నాళ్లుగా న‌లుగుతున్న ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు ర‌స‌కందాయంలో ప‌డింద‌ని అంటున్నారు విద్యార్థులు.  ఇంచార్జి రిజిస్ట్రార్ గారు తన గేమ్ మొదలు పెట్టేశారని ఎస్వీయూ వర్గాలే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.మంగ‌ళ‌వారం అమరావతికి వెళ్లి, ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో భేటీ అవ్వాల‌ని, ముఖ్యంగా త‌న శాఖ‌కు సంబంధించిన ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయిన ఇంచార్జి రిజిస్ట్రార్ ఈ విష‌యాన్నే ప్ర‌దానంగా చ‌ర్చ‌కు పెట్టేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు.

ఇదిలావుంటే, రిజిస్ట్రార్ వ్య‌వ‌హారంపై మాన‌వ‌హ‌క్కుల సంఘాన్ని ఆశ్ర‌యించేందుకు స‌ద‌రు సంస్థ ప్ర‌తినిధులు స‌హా విద్యార్థులు స‌మాయ‌త్తం అవుతున్నారు.
ఒక దివ్యాంగ అభ్య‌ర్థిని ఇలా నిర్బంధించ‌డం, ఆయ‌న‌తో సంత‌కాలు తీసుకోవ‌డంపై ఫిర్యాదు చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలిసిందే. ఇదే క‌నుక జ‌రిగితే.. రాష్ట్రంలోనే తొలిసారి ఓ యూనివ‌ర్సిటీకి సంబంధించిన వివాదం మాన‌వ‌హ‌క్కుల సంస్థ‌కు చేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త‌ద్వారా వ‌ర్సిటీ ప‌రువు పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: