అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోమారు త‌న శృతిమించిన లౌక్యాన్నిబ‌య‌ట‌పెట్టారు. న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల‌కు హాజ‌రైన పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ మీడియాతో మాట్లాడారు.  ఈ సంద‌ర్భంగా....ఇమ్రాన్‌ఖాన్‌ను న‌మ్ముతాన‌ని డోనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు....ప్రవాస భారతీయులను చూసి తాను ఎంతో గర్విస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. అమెరికా అభివృద్ధిలో వారు గొప్ప పాత్రను పోషించారని కొనియాడారు. 


వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ప్రవాస భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్‌ ప్రయత్నించారు.  టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమానికి ట్రంప్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ‘హౌడీ-మోదీ’ని చారిత్రాత్మక సభగా అభివర్ణించారు. అమెరికావ్యాప్తంగా ఉన్న దాదాపు 40 లక్షల మంది ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరంతా కష్టపడి పనిచేస్తారు. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. వైద్యం, సాంకేతిక రంగాల్లో కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తున్నారు. వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. అమెరికా సంస్కృతిని, విలువలను సుసంపన్నం చేశారు. మీరు అమెరికన్లయినందుకు నేను నిజంగా చాలా గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు. తనను మించిన నిజమైన స్నేహితుడు భారత్‌కు మరొకరు లేరని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  


అనంత‌రం, ఐరాస స‌ద‌స్సులో పాక్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం నిర్వ‌హించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒక‌వేళ పాక్‌, భార‌త్ కావాల‌నుకుంటే, క‌శ్మీర్ అంశంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ట్రంప్ అన్నారు. క‌శ్మీర్ ఓ సంక్లిష్ట‌మైన స‌మ‌స్య అని, కానీ రెండు దేశాలు అంగీక‌రిస్తేనే దానిపై రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని ట్రంప్ అన్నారు. భార‌త ప్ర‌ధాని మోదీ, పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌తోనూ త‌న‌కు మంచి సంబంధాలు ఉన్న‌ట్లు చెప్పారు. గ‌తంలో తానెప్పుడూ మ‌ధ్య‌వ‌ర్తిగా విఫ‌లం కాలేద‌ని, క‌శ్మీర్ స‌మ‌స్య‌పై తాము కావాల‌నుకుంటే అందుబాటులో ఉంటాన‌న్నారు. అమెరికా, పాక్ సంబంధాల‌పైన కూడా ట్రంప్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. గ‌తంలో అమెరికా దేశాధ్య‌క్షులు పాక్‌తో స‌రైన సంబంధాలు నెల‌కొల్పుకోలేద‌న్నారు. పాకిస్థాన్‌ను న‌మ్ముతాన‌ని, ఇమ్రాన్ ఖాన్‌ను కూడా విశ్వ‌సిస్తాన‌ని ట్రంప్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: