నరేంద్ర మోడీ రాజకీయ చాణక్యుడు. ఆయన ఏ పని చేసినా దానికి అర్ధం పరమార్ధం చాలానే ఉంటాయి. అటువంటి మోడీ ఇపుడు ఒక్కసారిగా అమెరికా పెద్దన్న ట్రంప్ కి బాజాలు కొడుతున్నారు. ట్రంప్ యావత్తూ  ప్రపంచానికి దిక్కు అంటున్నారు. ట్రంప్ లేని లోకాన్ని వూహించలేమని కూడా అంటున్నారు. హ్యూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ మీటింగ్ మొత్తం ట్రంప్ ప్రచార సభగా మార్చేసిన మోడీ మొత్తానికి ఎందుకిలా చేస్తున్నారు. ఏమాశిస్తున్నారు.


ట్రంప్ వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఆయన నాలుగేళ్ల పాలన పట్ల అమెరికాలో మిశ్రమ స్పందన ఉంది. ట్రంప్ గెలవచ్చు, ఓడిపోవచ్చు కూడా. ఇపుడే ఏం చెప్పలేం. ఎందుకంటే గత ఎన్నికలో ట్రంప్ ఇలా అనూహ్యంగా ముందుకు వస్తారని ఎవరూ అనుకోలేదు కాబట్టి. మరి ట్రంప్ తోనే అంతా అంటూ భారత్ బంధాలను పెనవేసి ఆయన‌కూ ఆయన పార్టీకి ప్రచారం చేస్తున్న మోడీ ట్రంప్ ఓటమి పాలు అయితే జరిగే పర్యవసానాలు వూహించకుండా ఉంటారా అన్న చర్చ కూడా ఉంది.


ఏది ఏమైనా ఇపుడు ట్రంప్ కి మోడీ కావాలి. మోడీకి కూడా ట్రంప్ కావాలి. కాశ్మీర్ ఇష్యూని చిటికెలో పరిష్కరించి ఇంటర్నేషనల్ హీరో అయిన మోడీ ట్రంప్ తో చెట్టాపట్టాలు వేసుకుని విశ్వ నాయకుడి అవతారం ఎత్తారు. ఏ దేశ నాయకునికీ లభించని మర్యాద, ఘనస్వాగతం మోడీ హ్యూస్టన్ మీటింగులో అందుకున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. అయితే ఇదే మీటింగులో  ట్రంప్ మళ్ళీ గెలవాలని చెప్పడం ద్వారా రాజకీయ వ్యూహాలకు కూడా మోడీ పదును పెట్టారు. నాలుగేళ్ల పాటు ట్రంప్ శ్వేత సౌధంలో ఉంటూ మోడీకి దగ్గర అయ్యారు. ఓ విధంగా చెప్పాలంటే ట్రంప్ మోడీ ఒకటే స్వభావం కలిగిన వారు అంటారు.


మొండితనానికి, పట్టుదలకు మారు పేరుగా ఉంటారు. అనుకున్నది చేసేయాలనుకుంటారు. అందువల్లనే ట్రంప్ మళ్ళీ రావాలని మోడీ అనుకుంటున్నారని వినిపిస్తోంది. ట్రంప్ విషయానికి వస్తే ఆయన‌కి ఇపుడు భారత్ అవసరం ఉంది. చైనాతో విరోధం కారణంగా ఆయన ఈ వైపునకు చూస్తున్నారు. వాణిజ్య బంధాలు అంటున్నారు. మరి పరిస్థితులు మారితే ట్రంప్ కూడా మారడం ఖాయం. ఏది ఏమైనా ఇపుడు మోడీ, ట్రంప్ భాయీ భాయీ అంటున్నారు. ఈ బంధాల వెనక ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయని అంతర్జాతీయ మీడియా అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: