మోడీ ముందు ఆచితూచి మాట్లాడతాడు. ఇమ్రాన్ ఖాన్ వస్తే మధ్యవర్తిత్వం ప్రస్థావన తెస్తాడు. ఏ ఎండకాగొడుగు పడుతున్న ట్రంప్.. తాజాగా మరోసారి మోడీతో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. 


భారత్, పాక్ ప్రధానులు ఇద్దరూ తనకు మంచి మిత్రులని చెబుతున్న ట్రంప్... కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. కాశ్మీర్ అంశం ఎప్పుడు చర్చకు వచ్చినా.. రెండు దేశాల మధ్య మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించేస్తున్నారు ట్రంప్. రెండు దేశాలు కోరితే మీడియేటర్‌గా ఉండేందుకు తాను సిద్ధమంటూ మరోసారి ప్రకటన చేశారు ట్రంప్. ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ కంటే ముందు ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. 


అయితే కాశ్మీర్ విషయంలో మరో దేశం జోక్యాన్ని సహించబోమని ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసింది భారత్. దీంతో మధ్యవర్తిగా ఉండాలని మోడీ కోరారంటూ... గతంలో కామెంట్ చేసి... తర్వాత మాటమార్చారు ట్రంప్. కానీ మోడీ ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో మరోసారి ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 


హౌడీ మోడీ కార్యక్రమంలో కలుసుకున్న ట్రంప్ మోడీ.... న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఐక్యరాజ్య సమితి 74వ సర్వసభ్య సమావేశంలో ట్రంప్‌ ప్రసంగం తర్వాత ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి కచ్చితమైన అజెండా వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ.. వాణిజ్యం, రక్షణ, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.


మరోవైపు.. హ్యూస్టన్‌ సభకు వచ్చినందుకు ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు మోడీ. ట్రంప్‌ తనకూ, భారత్‌కు మంచి మిత్రుడని ప్రసంశలు కురిపించారు. త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటామన్నారు. భారత ప్రగతి కోసం మోడీ అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పారు. సీమాంత ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో మోడీకి తెలుసంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ట్రంప్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: