ఈస్ధాయి అవమానాన్ని చంద్రబాబునాయుడు ఊహించుండరు. మాజీ సహచరుడు, బినామీగా ప్రచారంలో ఉన్న టిడిపి ఫిరాయింపు ఎంపి, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి కూడా చంద్రబాబును చీదరించుకుంటున్నారు. కరకట్ట మీద అక్రమ నివాసంలో ఇంకా చంద్రబాబు ఎందుకుంటున్నారో తనకు అర్ధం కావటం లేదన్నారు.

 

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తానైతే కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణం నుండి ఎప్పుడో ఖాళీ చేసుండే వాడినని స్పష్టంగా చెప్పేశారు. ఒకవేళ తాను నివాసముంటున్న ఇంటిని ప్రభుత్వం కూల్చేస్తే సానుభూతి పొందవచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారేమో అంటూ అనుమానాన్ని కూడా సుజనా వ్యక్తం చేయటం విశేషం.

 

మరి చంద్రబాబు ఆలోచనలు సుజనాకు కాక ఇంకెవరికి తెలుస్తాయి లేండి. మొత్తానికి చంద్రబాబు వ్యూహాన్ని సుజనా బాగానే బయటపెట్టేశారు. నిజానికి అధికారంలో ఉన్నప్పటికంటే ఓడిపోయిన తర్వాతే మరీ లేకిగా తయారయ్యారు. వైసిపి చేతిలో చావుదెబ్బ తినటాన్ని చంద్రబాబు ఇప్పటికి కూడా తట్టుకోలేకున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించలేకున్నారు.

 

మానసిక సమస్యలతోనే జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు రెచ్చిపోతు ఆరోపణలు, విమర్శలు చేసేస్తున్నారు. సరే చంద్రబాబే అలా చేస్తుంటే నారా లోకేష్ మాత్రం ఎందుకూరుకుంటారు. కాబట్టే తండ్రి, కొడుకులు ట్విట్టర్లో చాలా చవకబారుగా విమర్శలు గుప్పిస్తు తమ భుజాలను తామే చరుచుకుంటున్నారు.

 

సరే మళ్ళీ విషయంలోకి వస్తే బిజెపిలోకి ఫిరాయించిన సుజనా మొన్నటి వరకూ చంద్రబాబుకు అనుకూలమైన రాజకీయాలనే నడుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా కొందరు రాష్ట్రంలోని నేతల మైండ్ సెట్ కూడా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఏమైందో ఏమో ఒక్కసారిగా యు టర్న్ తీసుకున్నట్లే కనబడుతోంది. అందుకనే  చంద్రబాబుకు బుద్ధులు చెప్పారు. కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాన్ని చంద్రబాబు వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. బహుశా సుజనా రాజకీయాలను గమనించిన జాతీయ నేతలు వార్నింగ్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: