తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే మూడురోజుల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయన్నారు.


అయితే, ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌పై వ‌ర్షం ఎఫెక్ట్ భారీగా ఉంది. భారీగా వర్షం పడుతుండటంతో నగరం మొత్తం జలమయం అయిపోయింది. సహాయక చర్యలు చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో 04021111111, డయల్ 100, మై జీహెచ్‌ఎంసీ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. చెట్లకు, విద్యుత్ స్థంబాలకు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్‌కుమార్‌లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విడతల వారీగా ఉద్యోగులు ఇళ్ల‌కు వెళ్లాలని మేయర్ కోరారు. జీహెచ్ఎంసీ సిబ్బంది లేకుండా మ్యాన్ హోల్ ఓపెన్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.


కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన భారీవర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయింది. సగటున ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అత్యధికంగా తిరుమలగిరిలో రికార్డుస్థాయిలో 12.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, సికింద్రాబాద్- ఉప్పల్, రామంతాపూర్- చాదర్‌ఘాట్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ తదితర ప్రధానరోడ్లపై నీరు నిలువడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు నాలుగు జిల్లాల్లో భారీవర్షం కురిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: