మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మెడకు కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఆయన జైలు నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనుమరగయ్యాయి. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో జైలులో ఉన్న చింతమనేనికి రిమాండ్‌ పొడిగించింది కోర్టు. ఒక కేసు తర్వాత మరొకటి వచ్చి పడుతుండంతో ఈ మాజీ ఎమ్మెల్యేకి ఇప్పట్లో బెయిల్‌ దొరికే ఛాన్స్ కన్పించడం లేదు.


దెందులురు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వరుస కేసులు ఉక్కిరిబిక్కి చేస్తున్నాయి. గడిచిన పదేళ్ళ నుంచి చింతమనేని ప్రభాకర్ పై ఇప్పటి వరకు 66 కేసులు నమోదయ్యాయి. వీటిలో నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఎక్కువగా ఉన్న కేసులే ఎక్కువ. పోలీసులు అరెస్టు చేస్తారని ముందే పసిగట్టిన ప్రభాకర్ ఆగస్టు 30న  అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 12ప్రత్యేక బృందాలు గాలించినా చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయలేకపోయాయి. ఈనెల 11న అజ్ఞాతం వీడిన ప్రభాకర్‌ను ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. రెండు ఏళ్ల క్రితం  అప్పనవీడు గ్రామంలో స్థల వివాదంలో చింతమనేని ఆయన అనుచరులు కలిసి ఒక వ్యక్తిని నిర్భందించి కులం పేరుతో తిట్టారు. ఈ కేసులో చింతమనేనికి న్యాయస్థానం 14రోజుల రిమాండ్  విధించింది. రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి చింతమనేని ప్రభాకర్‌ను కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.  కోర్టు రిమాండును పొడిగించింది. దీంతో వచ్చేనెల తొమ్మిది వరకు చింతమనేని ఏలురు సబ్ జైలులోనే కొనసాగాల్సి ఉంటుంది. 


చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు సమయంలో జరిగిన హైడ్రామాలో కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ ఇంట్లో నిర్భందించారని మరో కేసు నమోదైంది. కేసు తర్వాత కేసును పోలీసులు న్యాయస్థానం ముందుంచడంతో చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రభాకర్ పై నమోదయిన కేసులు సంఖ్య 66కి చేరింది. వీటిలో పాతిక కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటి నుంచి బయట పడాలంటే ఇప్పట్లో ఆయనకు సాధ్యమయ్యేలా లేదు. వచ్చే నెల తొమ్మిది వరకు చింతమనేని ప్రభాకర్ సబ్ జైలులోనే ఉండాలి.  అనంతరం వరుస కేసులు ఒక్కొక్కటిగా న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో చింతమనేనికి కష్టాలు తప్పేలా లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: