ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో న్యూయార్క్‌లో ట్రంప్‌, మోదీ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో ఇరువురు నేతలు మాట్లాడారు. మోదీకి ముందు అనేక సమస్యలతో ఉన్న భారతదేశం.. ఆయన హయాంలో ఒకేతాటిపైకి వచ్చిందని మోదీని డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసించారు. భారతదేశ పితగా ఆయనను అభివర్ణించారు. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. నరేంద్ర మోదీని ‘ఫాదర్ ఆఫ్ ఇండియా‘ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొగడడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతి పిత మహాత్మ గాంధీతో ప్రధాని మోడీని ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నించారు.


ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ...ట్రంప్ చేసిన ‘ఫాదర్ ఆఫ్ ఇండియా’ కామెంట్స్ విషయాన్ని మోదీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఒవైసీ అన్నారు. మోదీని గాంధీజీతో పోల్చడాన్ని తాను అంగీకరించబోనని చెప్పారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహాత్ముడిని జాతిపితగా దేశమంతా పూజిస్తోందన్నారు. ఆ బిరుదు ఒకరు ఇస్తే వచ్చేది కాదని, సాధించుకునేదని ఒవైసీ చెప్పారు. ట్రంప్ ఒక ఇల్లిటరేట్ అని, భారతదేశ చరిత్ర గానీ, స్వాతంత్ర్య పోరాటం గురించి కానీ ఏమాత్రం తెలియదని అన్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేతలను సైతం ఎప్పుడూ జాతి పిత అని పిలవలేదని ఒవైసీ గుర్తు చేశారు. 


కాగా, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ...ఉగ్రవాదంపై పాక్‌కు మోదీ గట్టి సందేశం ఇచ్చారని, పాకిస్థాన్‌ దాన్ని వింటుందని భావిస్తున్నానన్నారు. ‘మోదీ గొప్ప జెంటిల్‌మన్‌. గొప్ప లీడర్‌. ఇంతకుముందు భారతదేశం అసమ్మతి, కుమ్ములాటలతో ప్రాంతాలవారీగా చీలిపోయి ఉండేదని నాకు గుర్తు. అలాంటి భారతదేశాన్ని మోదీ ఒక తండ్రిలాగా ఒకతాటిపైకి చేర్చారు. కాబట్టి మనం ఆయనను భారత పితగా పిలవొచ్చు’ అని ట్రంప్‌ కొనియాడారు. మోదీని అమెరికా పాప్‌ సింగర్‌ ఎల్విస్‌ ప్రెస్లీతో ట్రంప్‌ పోల్చారు. ఈ సందర్భంగా హౌడీ మోదీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోగ్రాఫ్‌ను మోదీ.. ట్రంప్‌కు బహూకరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: