సాధారణంగా చాలా సందర్భాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఖాతాలలో జమ అయ్యే డబ్బులను బ్యాంకులు ఆ ఖాతాదారులకు అప్పులు ఉంటే మినహాంచుకుంటాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పథకాల లక్ష్యాలు బ్యాంకర్లకు వివరించటం జరిగింది. ప్రభుత్వ పథకాల ద్వారా జమ అయ్యే డబ్బులను మినహాయించుకోకూడదని బ్యాంకర్లకు సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
బ్యాంకర్లు, ప్రభుత్వం కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని సీఎం జగన్ అన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు మరియు డ్రాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయంలో వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తామని తెలిపారు. గ్రామ వాలంటీర్లు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రశీదులను లభ్దిదారులకు అందిస్తారని తెలిపారు. 
 
సున్నా వడ్డీల కింద చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల జాబితా ఇస్తే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న దుకాణాలు, చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులను ఇస్తామని వారిని ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంకర్లు గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయం సేవలను వినియోగించుకోవచ్చని సీఎం సూచనలు ఇచ్చారు. రైతుల కోసం వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నామని, వర్క్ షాపు ద్వారా వ్యవసాయంలో అత్యుత్తమ విధానాలను రైతులకు తెలియజేస్తామని అన్నారు. 
 
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎంతోమంది కంపెనీలు పెడుతున్నారని బ్యాంకర్లు వారికి చేయూత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు బ్యాంకర్ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సామాన్యులను ఆదుకోవటంపై బ్యాంకర్లకు సూచనలిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పొగాకు రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని చెప్పారు. ఆరుతడి పంటలు, చిరు ధాన్యాలు పండించే రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: